అంత‌ర్జాతీయ విమానాల‌పై నిషేధం పొడిగింపు

 

న్యూఢిల్లీ ,(ఆరోగ్యజ్యోతి): అంతర్జాతీయ విమానాల‌పై నిషేధాన్ని కేంద్రం మ‌రో 30 రోజులు పొడిగించింది. క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ ప్రారంభ‌మైన‌ప్ప‌ట్టి నుంచి అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై భార‌త్ నిషేధం విధించింది. భార‌త్ నిర్ణ‌యం తీసుకుని దాదాపు 11 నెల‌లు అవుతుంది. క‌రోనా ఫ‌స్ట్ వేవ్ పోయి.. సెకండ్ వేవ్ ప్రారంభ‌మైన నేప‌థ్యంలోనూ నిషేధం పొడిగిస్తూ వ‌చ్చిన కేంద్రం స‌ర్కార్ తాజాగా, మ‌రో 30 రోజులు ఆ నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్ల‌డించింది. జూన్ 30వ తేదీ వరకు ఈ నిషేధం అమ‌ల్లో ఉంటుంద‌ని డీజీసీఏ శుక్రవారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. అయితే, డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన అంతర్జాతీయ కార్గో ఆపరేషన్లు, విమానాలకు మాత్రం ఈ ఆంక్షలు వర్తించవు.కొవిడ్ కారణంగా గత ఏడాది జూన్ 30 నుంచి అన్ని అంతర్జాతీయ క‌మ‌ర్షియ‌ల్‌, ప్యాసింజర్ విమానాలపై నిషేధం అమల్లో ఉన్న‌ది. అయినప్పటికీ ప్యాసింజర్ల రాకపోకలకు అవరోధం లేకుండా పలు దేశాలతో ఇండియా చేసుకున్న ద్వైపాక్షిక ఎయిర్ బబుల్ ఒప్పందం ప్రకారం పలు అంతర్జాతీయ విమానాల ఆపరేషన్ జరుగుతున్న‌ది. అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ , ఆఫ్ఘనిస్తాన్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, కెనడా, ఇథియోపియా, జర్మనీ, ఇరాక్, జపాన్, కువైట్, మాల్దీవులు, నేపాల్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, ఖతార్, రువాండా, సీషెల్స్, టాంజానియా, ఉక్రెయిన్ స‌హా 28 దేశాల‌తో భార‌త్‌ ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుంది. మహమ్మారి మధ్య భారతదేశం మరియు ఇతర దేశాల మధ్య ముందస్తు షరతులతో విమానాలను తిరిగి ప్రారంభించే విధాన‌మే ఈ ఎయిర్ బ‌బుల్ ఒప్పందం ఉద్దేశం. కాగా క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న త‌రుణంలో మ‌రో 30 రోజులు అంత‌ర్జాతీయ విమానాల‌పై నిషేధం పొడిగించింది కేంద్రం.