మహారాష్ట్రలో 8 వేల మందికిపైగా చిన్నారులకు కరోనా.. థర్డ్ వేవేనా?



ముంబై (ఆరోగ్యజ్యోతి): కరోనా సెకండ్ వేవ్ నుంచి క్రమంగా బయటపడుతున్న మహారాష్ట్రను ఇప్పుడు మరో భయం వణికిస్తోంది. రాష్ట్రంలోని అహ్మద్‌నగర్ జిల్లాలో 8 వేల మందికిపైగా చిన్నారులు కరోనా బారినపడడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది కరోనా థర్డ్ వేవేనంటూ జనం భయపడుతున్నారు. కరోనా బారినపడిన చిన్నారులకు చికిత్స అందించేందుకకు సాంగ్లిలో ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు చేశారు.మే నెలలో 8 వేల మంది చిన్నారులు కరోనా బారినపడ్డారని, ఇది చాలా ఆందోళన కలిగిస్తోందని అహ్మద్‌నగర్ జిల్లా చీఫ్ రాజేంద్ర భోసలే పేర్కొన్నారు. కాగా, ఆగస్టు-సెప్టెంబరులో రాష్ట్రంలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందన్న నిపుణుల హెచ్చరికలతో మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. వారి కోసం ప్రత్యేకంగా కొవిడ్ వార్డులు ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం సాంగ్లిలో ఓ వార్డు ఏర్పాటు చేసింది. సెకండ్ వేవ్‌లో బెడ్లు, ఆక్సిజన్ వంటి వాటికి తీవ్ర కొరత ఏర్పడిన నేపథ్యంలో థర్డ్‌వేవ్‌లో అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడుతున్నట్టు ఎమ్మెల్యే సంగ్రామ్ జగతప్ పేర్కొన్నారు. థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు పూర్తి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.కరోనా థర్డ్ వేవ్ ఎప్పుడు, ఏ తేదీల్లో వస్తుందో తెలియదు కాబట్టి దానిని ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నట్టు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న ఆంక్షలను జూన్ 15 వరకు పొడిగిస్తున్నట్టు చెప్పారు.