కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 9848025451)
అమరావతి(ఆరోగ్యజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 14 వైద్య కళాశాలల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానం ద్వారాపిడుగురాళ్ల, మచిలీపట్నం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుకొండ, నంద్యాల, ఆదోనిలో ఏర్పాటు చేయనున్న కాలేజీలకు సీఎం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. పేదవారికి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి పార్లమెంట్ పరిధిలోనూ టీచింగ్ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని, మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 16 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే పులివెందుల, పాడేరులో మెడికల్ కాలేజీల పనులు జరుగుతున్నాయని.. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని సీఎం వెల్లడించారు.
ఒకేసారి 14 వైద్యకళాశాలలకు శంకుస్థాపన
పార్లమెంటుకు ఒకటి వంతున 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తుండగా.. ఇప్పటికే పులివెందుల, పాడేరు వైద్యకళాశాలలకు శంకుస్థాపన పూర్తయింది. మిగతా 14 మెడికల్ కాలేజీలకు సీఎం ఈ రోజు శంకుస్థాపన చేశారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఒకేసారి 4 వైద్య కళాశాలలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాతగానీ, అంతకు ముందుగానీ ప్రభుత్వ పరిధిలో ఎప్పుడూ ఇంత పెద్దస్థాయిలో ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు ఒకేసారి 14 వైద్యకళాశాలలకు శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోను ఒకేసారి ఇన్ని వైద్య కళాశాలలు ఏర్పాటు చేయలేదు.