14 మెడికల్‌ కాలేజీలకు నేడు శంకుస్థాపన

 అమరావతి(ఆరోగ్యజ్యోతి) :రాష్ట్రంలో 14 కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి సీఎం జగన్మోహన్‌రెడ్డి సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక మెడికల్‌ కాలేజీ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్రంలో 16 కొత్త కాలేజీల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. వీటిలో పాడేరు, పులివెందుల మెడికల్‌ కాలేజీలకు ఇప్పటికే శంకుస్థాపన చేశారు. మిగిలిన 14 మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి సోమవారం సీఎం శంకుస్థాపన చేయనున్నారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం జగన్‌ వర్చువల్‌గా ఈ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే కొన్ని కాలేజీల నిర్మాణానికి టెండర్లు ఫైనల్‌ కాకుండానే హడావిడిగా శంకుస్థాపన చేస్తుండటం గమనార్హం.