అహ్మదాబాద్,(ఆరోగ్యజ్యోతి): దేశంలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతున్నది. గత నాలుగు రోజుల నుంచి వరుసగా ప్రతిరోజు 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. శుక్ర, శని వారాల్లో కొత్తగా రోజుకు 62 వేల మందికి పైగా కరోనా బారినపడ్డారు. దేశవ్యాప్తంగా ఒకవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా మరోవైపు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.తాజాగా గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌లో కరోనా మహమ్మారి కలకలం రేపింది. అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో (ఐఐఎంలో) విద్యార్థులు, ప్రొఫెసర్లు కలిపి మొత్తం 40 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో వారందరినీ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన డిప్యూటీ హెల్త్ ఆఫీసర్ మెహుల్ ఆచార్య ఈ విషయాన్ని వెల్లడించారు.