ఆర్టీసీకి రూ.450 కోట్లు

 హైదరాబాద్‌, (ఆరోగ్యజ్యోతి): ఆర్టీసీకి బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదలచేసింది. ఉద్యోగుల లాక్‌డౌన్‌ కాలం నాటి వేతనం 120 కోట్లతోపాటు ఆర్టీసీ సహకార సంఘానికి 200 కోట్లు సహా 450 కోట్ల రూపాయలను మంజూరుచేసింది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా జిల్లాల్లో బస్సులు అంతంత మాత్రమే నడుస్తుండగా, హైదరాబాద్‌లో ఇప్పటికీ సగం బస్సులు కూడా రోడ్డెక్కడంలేదు. ఆదాయం రాని ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఉద్యోగులను కన్నబిడ్డలుగా భావించి మరోసారి ఉదారతను చాటుకున్నారు. లాక్‌డౌన్‌ కాలంలో కోత విధించిన 50% వేతనాన్ని విడుదలచేసి సంస్థ ఉద్యోగుల్లో సంబురం నింపారు. త్వరలోనే ఈ మొత్తం వారివారి ఖాతాల్లో జమకానున్నది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు సైతం తప్పనిసరి పరిస్థితుల్లో రెండునెలలపాటు ఆర్టీసీ ఉద్యోగుల వేతనంలో 50% కోత విధించింది. కోత విధించిన రూ.120 కోట్లను వెంటనే విడుదలచేయాలని ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆర్థికశాఖను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. దీంతో తాజాగా ఆర్థికశాఖ నిధులను మంజూరుచేసిందని ఆర్టీసీ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. 

కోత విధించిన 50% వేతనాలకు సంబంధించి రూ.120 కోట్లు, ఆర్టీసీ కోఆపరేటివ్‌ సొసైటీకి చెల్లించాల్సిన రూ.200 కోట్లు, గతేడాది సమ్మె సందర్భంగా బకాయి ఉన్న 12 రోజుల వేతనాలకు సంబంధించి సొమ్ము.. ఇలా మొత్తంగా రూ.450 కోట్లను విడుదలచేసిందని బస్‌భవన్‌ అధికారులు తెలిపారు. త్వరలోనే కార్మికుల ఖాతాల్లో ఈ డబ్బు జమవుతాయని చెప్పారు. రాష్ట్రంలోని మిగతా ప్రభుత్వ ఉద్యోగులు లాక్‌డౌన్‌ కాలంలో పనిచేసినప్పటికీ వారి వేతనాల్లో కోత విధించారు. ఆ తర్వాత దశలవారీగా నిధులు విడుదల చేశారు. కానీ, లాక్‌డౌన్‌లో ఆర్టీసీ ఉద్యోగులు పనిచేయకపోయినా కార్మికుల కడుపులు మాడొద్దని పెద్ద మనసు చాటుకున్నారు. ఆర్టీసీకి నిధులు విడుదల చేయడంపై అధికారులు, ఉద్యోగులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఆపదవేళ అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.