ఈఎస్‌ఐ బకాయిలు చెల్లించేదెన్నడో?

కాగజ్‌నగర్‌లో మున్సిపల్‌ కార్మికులకు వైద్యం అందక ఇక్కట్లు


జీతాల్లో కోత విధిస్తున్నా ఆయా కార్పొరేషన్లకు జమ కాని వైనం


ఆందోళన బాటలో కార్మికులు


 


కాగజ్‌నగర్‌, : కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు ఈఎస్‌ఐ వైద్యం అందక ద్రాక్షగా మారింది. కాంట్రాక్టు కార్మికుల జీతాల నుంచి ప్రతీ నెల ఈఎస్‌ఐ, పీఎఫ్‌కు సంబంధించి కోత విధిస్తున్నప్పటికీ ఆ డబ్బులను సంబంధిత కార్యాలయాలకు చెల్లించక పోవడంతో సమస్యలు వస్తున్నాయి. అత్యవసరంగా వైద్యం కోసం స్థానిక ఈఎస్‌ఐ ఆసుపత్రికి వెళితే కార్పొరేషన్‌కు డబ్బులు కట్టకపోవడంతో హైదరాబాద్‌కు రెఫర్‌ చేయలేమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో కాంట్రాక్టు కార్మికులు అప్పులు చేసి ప్రైవేటు ఆసు పత్రుల్లో వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి నెల కొంది. సమస్యను పరిష్కరించాలని కాంట్రాక్టు కార్మికులు పలుమార్లు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేసినప్పటికీ ఫలితం లేదు.  


 


పేరుకుపోయిన రూ.90లక్షల బకాయిలు


కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో మొత్తం 141 మంది  కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి ప్రతీ నెల రూ.12,000 జీతం వస్తుండగా అందులో నుంచి ఈఎస్‌ఐ, పీఎఫ్‌ పేరిట రూ.1200 కోత విధిస్తు న్నారు. కానీ కోత విధించిన డబ్బులు ఐదేళ్లుగా సంబంధిత కార్పొరేషన్లకు జమ చేయడం లేదు. దాదాపు రూ.90లక్షల మేర కార్మికుల ఈఎస్‌ఐ, పీఎఫ్‌ బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలు చెల్లి స్తేనే ఈఎస్‌ఐ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు అందిం చడమే కాకుండా అత్యవసర సమయాల్లో హైదరా బాద్‌లోని కార్పొరేట్‌ ఆసుపత్రులకు తరలించే అవ కాశం ఉండేది.  అధికారులు నిర్లక్ష్యంతో తమకు మెరుగైన వైద్య సేవలు అందక తంటాలు పడాల్సి వస్తోందని కార్మికులు ఆరోపిస్తున్నారు. తమ జీతా ల్లోంచి కోత విధించినప్పటికీ ఎందుకు కార్పొరేషన్‌కు చెల్లింపులు చేయటం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అత్యవసర సమ యాల్లో వైద్య చికిత్సల కోసం నానాతంటాలు పడాల్సిన పరిస్థితి వస్తోంది.  అప్పులు చేసి ప్రైవేటు ఆసుపత్రులో చికిత్సలు చేయించుకుంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తమ ఈఎస్‌ఐ, పీఎఫ్‌ బకాయిలను వెంటనే ఆయా కార్పొరేషన్లలో జమ చేసి వైద్యం అందేటట్లు తగిన చర్యలు చేపట్టాలని కార్మికులు డిమాండ్‌ చేస్తు న్నారు. లేని పక్షంలో ఆందోళన బాటపట్టి విధులు బహిష్కరిస్తామని కాంట్రాక్టు కార్మికులు హెచ్చరి స్తున్నారు.