గురుగ్రామ్ ఆసుపత్రి ఘటనపై మహిళా కమిషన్ సుమోటో విచారణ

గురుగ్రామ్ : గురుగ్రామ్ ఆసుపత్రిలో మహిళా రోగిపై ఉద్యోగి అత్యాచారం జరిపిన ఘటనపై హర్యానా మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దారుణ ఘటనపై పత్రికల్లో వచ్చిన వార్తలపై మహిళా కమిషన్ సుమోటోగా విచారణకు ఆదేశించి, విచారణకు ఒక కమిటీని నియమించింది. హర్యానా మహిళా కమిషన్ కమిటీ ఆసుపత్రికి వచ్చి బాధితురాలిని కలిసింది. బాధితురాలి కుటుంబసభ్యులు, ఆసుపత్రి ఉద్యోగులతో మహిళా కమిషన్ కమిటీ సభ్యులు మాట్లాడారు. ఈ ఘటనపై ఆసుపత్రి యాజమాన్యం, పోలీసులు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని హర్యానా మహిళా కమిషన్ ఉపాధ్యక్షురాలు ప్రీతీ భరద్వాజ్ చెప్పారు.ఆసుపత్రిలోని ఐసీయూలో మహిళా టీబీ రోగిపై జరిగిన అత్యాచార ఘటనపై సీసీ టీవీ ఫుటేజ్ సాయంతో ఇద్దరు నిందితులను గుర్తించారు. తాను వెంటిలేటరుపై చికిత్స పొందుతూ స్పృహ లేని స్థితిలో ఉన్నపుడు  ఆసుపత్రి ఉద్యోగి  ఒకరు తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు తన చేత్తో రాసిన నోట్ ద్వారా తండ్రికి తెలిపింది. బాధిత యువతి ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. మహేంద్రనగర్ ప్రాంతానికి చెందిన యువతి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ క్షయవ్యాధికి చికిత్స పొందేందుకు ఐసీయూలోని ఓ ప్రైవేటు గదిలో చేరిందని పోలీసులు చెప్పారు.రోగిని కలిసేందుకు వచ్చిన తండ్రికి బాధిత యువతి రాతపూర్వకంగా తెలిపిందని ఏసీపీ ఉషా కుండు చెప్పారు. ఈ ఘటనపై సుశాంత్ లోక్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 376(2)ఇ కింద కేసు నమోదు చేసి, నిందితుడిని గుర్తించామని ఏసీపీ చెప్పారు.