యేటా పెరుగుతున్న బాధితులు
ఏడాది కాలంలో 761 మందికి నిర్ధారణ
కారణాలను అన్వేషిస్తున్న నిపుణులు
ఆసిఫాబాద్: కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా క్షయ వ్యాధికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇక్కడ ప్రతియేటా ఇంచు మించు వెయ్యి మందికి పైగా కొత్తగా టీబీ సోకు తుందంటే పరిస్థితి తీవ్రత ఎంత భయం కరంగా మారిందో ఊహించవచ్చు. 2018లో జిల్లాలో 804 మంది ఈ మహమ్మారి బారిన పడినట్లు గుర్తించారు. అలాగే ఈ ఏడాది సెప్టెంబరు 30 నాటికి కొత్తగా 761 మంది క్షయ వ్యాధిగ్రస్తులు నమోద య్యారు. అధికారికంగా గుర్తించిన సంఖ్య ఇలా ఉంటే ఆసుపత్రులకు రాని రోగుల సంఖ్య లెక్కేలేదని చెప్పవచ్చు. జిల్లాలో ఇంతవేగంగా క్షయవ్యాధి విస్తరించడానికి గల కారణాలను అన్వేషించడానికి వైద్యాధికారులు శతవిధాలా ప్రయత్నిస్తున్నా మూలా లను కనిపెట్టలేక పోతున్నారు.
బాధితుల గుర్తింపుపై నజర్
క్షయ వ్యాధి యేటా విస్తరించేందుకు ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులు నివాసం ఉంటున్న పరిసరాల పరిస్థితులే దోహద పడుతున్నట్లు ప్రాథ మికంగా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, భిన్న మైన సంస్కృతి సంప్ర దాయాలు, మూఢనమ్మకాలు వెరసీ క్షయవ్యాధి విస్తృతికి కారణ మవుతున్నట్లు తేల్చారు. 2025 నాటికి క్షయవ్యాధి రహిత దేశంగా మార్చాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభు త్వం టీబీపై సమరశంఖం పూరించిన నేపథ్యంలో జిల్లాలో ఈవ్యాధిగ్రస్తుల గుర్తింపు ప్రక్రియ విస్తృ తంగా సాగుతోంది. ఇటీవల విడుదలైన జాతీయ క్షయవ్యాధి నివేదికల ప్రకారం తెలంగాణలో ఏడాది కాలంలో 7495 క్షయ వ్యాధి కేసులు నమోదు అయ్యాయి. అయితే ఆ గణంకాలను విశ్లేషించినప్పుడు కుమరం భీం జిల్లాలో వైద్యా ఆరో గ్యశాఖ లెక్కల ప్రకారం 2017లో 634 కేసులు, 2018లో 804 కేసులు నమోదు అయ్యాయి. 2018-19లో క్షయ వ్యాధిగ్రస్తుల సంఖ్య పరంగా కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఇక 2019-20లో 761మంది వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. మార్చి నుంచి డి సెంబరు వరకు గణాంకాలు కూడా వెల్లడైతే ఈ సంఖ్య మరింత పెరగనుంది.
మండలాల వారీగా నమోదైన కేసులు
గత ఏడాది అక్టోబరు నాటికి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 15 మండలాల్లో నమోదైన టీబీ కేసుల వివరాలా ఉన్నాయి. ఆసిఫాబాద్‌లో 98 మంది క్షయ వ్యాధి సోకింది. వాంకిడిలో 50 మంది, రెబ్బెనలో 49 మంది, జైనూరులో 47మంది, సిర్పూర్(యూ)లో 25 మంది, లింగాపూర్‌లో 12మంది, కెరమెరిలో 33 మంది, తిర్యాణిలో 39మంది, కాగజ్‌నగర్‌లో 153, దహెగాంలో 38మంది, సిర్పూర్(టి)లో 71, కౌటా లలో 43మంది, చింతలమానేపల్లిలో 34, బెజ్జూరులో 39మంది, పెంచికలపేటలో 30మంది వ్యాధిగ్ర స్తులను వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు గుర్తించాయి. కాగా కాగజ్‌నగర్‌లో అధికంగా 153 కేసులు నమోదు కాగా, లింగాపూర్‌లో అత్యల్పంగా 12కేసులు నమోదు అయ్యాయి. అయితే వైద్య ఆరోగ్య ఆరోగ్య శాఖ వద్ద నమోదు కాని కేసులు కూడా అధికంగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా వ్యాధి గ్రస్తులు మూఢ నమ్మకాలను వీడి చికిత్స చేయించు కోవాలని అధికారులు కోరుతున్నారు. దీనికి సంబంధిత గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు.
లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రిలో సంప్రదించాలి -కుమరం బాలు, డీఎంహెచ్‌వో
జిల్లాలో వ్యాధి లక్షణాలు కనబడితే వెంటనే దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలి. మూఢ నమ్మకాలకు పోకుండా చికిత్స చేయించుకుని వ్యాధిని తగ్గించుకునేందుకు కృషి చేయాలి. వైద్య ఆరోగ్య శాఖ క్షయవ్యాధిపై అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించుకున్నట్లయితే ప్రతీ నెల వ్యాధిగ్రస్తులందరికీ రూ.500 అందజేస్తాం.