హైదరాబాద్: దేశంలో వైద్య విద్య ఖరీదైనదిగా మారడం వల్ల ఆ విద్యను పేద, బలహీన వర్గాల విద్యార్థులు పొందలేకపోతున్నారని రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆవేదన వ్యక్తంచేశారు. ధనవంతులు మాత్రమే వైద్య విద్యలో ప్రవేశం పొందడం అనారోగ్య పరిణామమని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఆరోగ్య సంరక్షణ నిర్వహణ కేంద్రం, ఆస్కిలు సంయుక్తంగా ‘జాతీయ వైద్య కమిషన్ ప్రాధాన్యం’ అనే అంశంపై శనివారం నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో రాజ్‌భవన్ నుంచి ఆమె మాట్లాడారు. వైద్య విద్యను అభ్యసించడానికి వ్యయం పెరగడం ఆందోళనకరమని, ఈ నేపథ్యంలో కేంద్రం కొత్తగా ఏర్పాటు చేసిన జాతీయ వైద్యకమిషన్(ఎన్‌ఎంసీ) అన్ని వర్గాల విద్యార్థులు వైద్యవిద్యను అభ్యసించేందుకు అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. ‘‘వైద్య కళాశాలను ప్రారంభించడానికి రూ.400 కోట్ల పెట్టుబడి, అధిక విస్తీర్ణం స్థలంలో పెద్ద భవనాలు, 140 మంది బోధన నిపుణులు ఉండాలన్న నిబంధన విధించడం దురదృష్టకరం. భారీ పెట్టుబడులు పెట్టిన కళాశాలల యాజమాన్యాలు సేవ చేయడానికి ఇష్టపడటం లేదు. వైద్య విద్య ఖర్చులు తగ్గించడం, ఇతర సమస్యల పరిష్కారానికి కేంద్రం ఎన్‌ఎంసీ ఏర్పాటు చేసింది’’ అని గవర్నర్ వివరించారు.