- మధుమేహంతో బాధపడుతున్న బాలుడు
- రూ.లక్షా50 వేలు ఎల్‌వోసీ మంజూరు
సిరిసిల్ల (ఆరోగ్యజ్యోతి): మధుమేహం బారిన పడి అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. మెరుగైన చికిత్స కోసం సీఎం సహాయ నిధి నుంచి రూ.1.50 లక్షల ఎల్‌వోసీని మంజూరు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలకు చెందిన ఎడ్ల బాబు-రాజమల్లవ్వల కుమారుడు విష్ణు(12) పుట్టిన కొద్ది నెలల్లోనే మధుమేహం బారినపడ్డాడు. పేద కుటుంబానికి చెందిన బాబు ఉపాధి కోసం నాలుగేండ్ల క్రితం దుబాయి వెళ్లాడు. రాజమల్లవ్వ కూలీ పని చేసుకుంటూ బాలుడికి చికిత్స చేయిస్తున్నది. బాలుడి శరీరంలో చక్కెరస్థాయిలు ఎక్కువై కిడ్నీ సంబంధిత వ్యాధికి దారితీసింది. చికిత్స కోసం బాలుడిని నిమ్స్ దవాఖానలో చేర్పించగా సుమారు రూ.2 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న రాజమల్లవ్వ గ్రామానికి చెందిన జిల్లా రైస్‌మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు పురం అనీల్‌రావుకు గోడు వెల్లబోసుకున్నది. వారి పరిస్థితిని అనీల్‌రావు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి బాలుడి వైద్యం కోసం రూ.1.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేశారు. ఆపత్కాలంలో ఆదుకున్న కేటీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని బాలుడి తల్లి కృతజ్ఞతలు తెలిపింది.