7జిల్లాల్లో నో కరోన

హైదరాబాద్: గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోని.. జయశంకర్‌ భూపాలపల్లి, కామారెడ్డి, ఆసిఫాబాద్‌, ములుగు, నారాయణ పేట, నిర్మల్‌, పెద్దపల్లి జిల్లాల్లో  ఒక్క కరోనా కేసు కూడా నమో దు కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా కూడా కేవలం 582 కేసులే నమోదయ్యాయి. ఇటీవలి కాలంలో ఇంత తక్కువగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దసరా సందర్భంగా తక్కువ పరీక్షలు చేయడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా.. ఒక్క కేసు కూడా నమోదు కాని జిల్లాలు కొన్నిట్లో పండుగ కారణంగా అసలు టెస్టులే చేయలేదని, మరికొన్ని జిల్లాల్లో చాలా తక్కువగా చేశార ని అధికారులు చెబుతున్నారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా చేసింది 14,729 టెస్టులే. 12 జిల్లాల్లో 10లోపు కేసులు నమోదు కాగా.. జీహెచ్‌ఎంసీ పరిధిలో 174 కేసులు, మేడ్చల్‌లో 38, నల్లగొండలో 87, రంగారెడ్డిలో 55, సంగారెడ్డిలో 31 పాజిటివ్‌లు వచ్చాయి.


 


ఈ కేసులతో రాష్ట్రంలో పాజిటివ్‌ల సంఖ్య 2,31,834కు చేరింది. వైరస్‌ కారణంగా మరో నలుగురు మృత్యువాత పడటంతో ఇప్పటివరకూ చనిపోయిన వారి సంఖ్య 1311కు చేరింది. నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి సోదరుడు రంగారెడ్డి (66) కరోనా కారణంగా చనిపోయారు. ఎమ్మె ల్యే, కుటుంబసభ్యులు పీపీఈ కిట్లు ధరించి ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఇక.. ఆదివారం కొత్తగా 1432 మంది డిశ్చార్జ్‌ కావడంతో.. రాష్ట్రంలో ఇప్పటివరకూ వైరస్‌ బారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,11,912కు చేరుకుంది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 18,611గా ఉంది.


 


తగ్గిన భయం..


కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండడంతో ప్రజల్లో వైర్‌సపై భయం తగ్గిపోయింది. నిర్లక్ష్యం పెరిగినట్టు కనిపిస్తోంది. మాస్కులను ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి జాగ్రత్తలను చాలా మంది పాటించట్లేదు. కేరళలో ఓనం పండుగ తర్వాత కేసుల సంఖ్య భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. వేడుకల సమయంలో ప్రజలు కరోనా జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఇందుకు కారణం. ఇక్కడ కూడా దసరా, బతుకమ్మ పండుగ నేపథ్యంలో చాలాచోట్ల ప్రజలు గుంపులుగా చేరారు. వారిలో కొందరు ఎలాంటి జాగ్రత్తలూ పాటించలేదు. దీనివల్ల కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.