రాష్ట్రంలో వైద్యుల కొరత.. 7వేల మందికి ఒక్కడే డాక్టర్

14 జిల్లాల్లో డాక్టర్ల సంఖ్య వందలోపే


స్టేట్ స్టాటిస్టికల్ అబ్ స్ట్రాక్ట్ రిపోర్టులో వెల్లడి


ఖాళీ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం


ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేషెంట్లు


హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి): రాష్ర్టంలో ప్రభుత్వ దవాఖాన్లకు వచ్చే పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నా, వారికి ట్రీట్ మెంట్ అందించే డాక్టర్ల సంఖ్య మాత్రం పెరగడం లేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూహెచ్ఓ) లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక గవర్నమెంట్ డాక్టర్ ఉండాలి. కానీ మన రాష్ర్టంలో ప్రతి 6,700 మందికి ఒక్క డాక్టర్ మాత్రమే ఉన్నారు. ఇక ములుగు, నారాయణపేట సహా 14 జిల్లాల్లో డాక్టర్ల సంఖ్య వందలోపే ఉంది. ఈ జిల్లాల్లో ప్రతి 15,000 మందికి ఒక్క డాక్టర్ కూడా లేరు. రాష్ట్ర సర్కార్ రిలీజ్ చేసిన స్టేట్ స్టాటిస్టికల్ అబ్ స్ట్రాక్ట్ రిపోర్టులోనే ఈ విషయాలు వెల్లడయ్యాయి. రాష్ర్టంలోని ప్రభుత్వ దవాఖాన్లలో ప్రస్తుతం మొత్తం 5,637 మంది డాక్టర్లు పని చేస్తున్నారు. వీరిలో అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాలోనే 1,762 మంది ఉన్నారు. ఆ తర్వాత  సిద్దిపేట జిల్లాల్లో అత్యధికంగా 421 మంది ఉండగా.. ములుగులో అత్యల్పంగా 19 మంది, నారాయణపేట్‌లో 21 మంది మాత్రమే ఉన్నారు. డాక్టర్లు, హెల్త్ స్టాఫ్ కొరతతో పాటు సౌలతులు లేకపోవడంతో ఉస్మానియా లాంటి పెద్ద దవాఖాన్లలో కూడా ఆపరేషన్లు వాయిదా వేస్తున్నారు.


2,407 పోస్టులు ఖాళీలు


రాష్ర్టవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖాన్లలో 2,407 డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కీలకమైన టీచింగ్ హాస్పిటళ్లలోనే 1,359 మంది డాక్టర్ల కొరత ఉంది. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఆయా జిల్లా కేంద్రాల్లోని ఏరియా హాస్పిటళ్లనే.. జిల్లా హాస్పిటళ్లుగా అప్‌గ్రేడ్ చేశారు. ఇందుకు అనుగుణంగా కొన్ని చోట్ల బెడ్ల సంఖ్యను పెంచారు. కానీ డాక్టర్లను మాత్రం నియమించలేదు. ప్రస్తుతమున్న అవసరాలకు తగ్గట్టుగా కొత్త పోస్టులు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండగా, ఇప్పటికే మంజూరైన పోస్టులను కూడా సర్కార్ భర్తీ చేయడం లేదు. పేషెంట్ రద్దీ పెరిగి గైనకాలజీ, ఆర్థోపెడిక్స్‌, జనరల్ సర్జరీ వంటి విభాగాల్లో డాక్టర్లపై ఒత్తిడి పెరుగుతోంది. సిజేరియన్ డెలివరీల శాతం పెరగడానికి గైనకాలజిస్టుల కొరత కూడా ఓ కారణమేనని డాక్టర్లు చెబుతున్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డాక్టర్లు కోరుతున్నప్పటికీ, కేవలం కాంట్రాక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ వైపే సర్కార్ మొగ్గు చూపుతోంది. ప్రస్తుతం పని చేస్తున్న 5,637 మందిలోనూ 500 మంది కాంట్రాక్ట్ డాక్టర్లే కావడం గమనార్హం.