హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి): రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 42 లక్షలు దాటింది. గురువారం 43 వేల టెస్టులు నిర్వహించగా, 1,531 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలినట్టు శుక్రవారం విడుదలచేసిన బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 293 కేసులు వెలుగు చూశాయి. ఆ తర్వాత మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 120, రంగారెడ్డిలో 114, భద్రాద్రి కొత్తగూడెంలో 96, ఖమ్మంలో 83, నల్లగొండలో 74 కేసులు నమోదయ్యాయి. మరోవైపు రికవరీ రేటు రికార్డుస్థాయిలో 91.65 శాతంగా నమోదవగా, దేశంలో 91 శాతంగా ఉన్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2.37 లక్షల మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, 2.17 లక్షల మంది కోలుకున్నారు. 18,456 మంది చికిత్స పొందుతున్నారు.