నోవోసిబిర్స్క్: చదువుకోవాల్సిన వయసులో 14 ఏళ్లకే తల్లయ్యింది ఓ బాలిక. ఈ ఘటన రష్యాలోని నోవోసిబిర్స్క్ నగరానికి సమీపంలో ఉన్న వర్ఖ్-తులా గ్రామంలో జరిగింది. బాలిక తన గర్భం గురించి తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడి విషయాన్ని దాచిపెట్టింది. తీరా నెలలు నిండటంతో నొప్పులు వచ్చాయి. దాంతో బాలిక ఇంట్లోనే సీక్రెట్‌గా ఒక బాలుడికి జన్మనిచ్చింది. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పే ధైర్యం లేక శిశువును ప్లాస్టిక్ బ్యాగులో పెట్టి తమ ఇంటి గరాజ్‌లో ఉన్న ఫ్రీజర్‌లో దాచింది.అయితే బాలికకు డెలివరీ తర్వాత తీవ్ర రక్తస్రావం అయింది. అది చూసిన బాలిక తల్లి.. బాలిక అపెండిసైటిస్‌తో బాధపడుతోందని భావించింది. వెంటనే అంబులెన్స్‌ను పిలిపించి వైద్యం కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా.. బాలిక అంబులెన్స్‌లో వైద్యులకు అసలు విషయం చెప్పింది. తానో శిశువుకు జన్మనిచ్చానని.. భయంతో ఆ శిశువును ఫ్రీజర్‌లో దాచానని తెలిపింది. వెంటనే వైద్యులు అంబులెన్స్‌ను తిరిగి ఇంటివైపు తిప్పారు. ఇంటికి వెళ్లి ఫ్రీజర్‌లో బాలుడిని చూడగా.. అప్పటికే చనిపోయాడు. బాలిక మాత్రం ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.