ఆదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి): ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా నిర్వహిస్తున్న క్లినిక్‌లపై జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్, జిల్లా సర్వై లైన్స్ అధికారి వైసీ శ్రీనివాస్ బుధవారం తనికి చేశారు.పలువురు ఆర్‌ఎంపీలు దవాఖానలు ఏర్పాటు చేసి వచ్చి రానివైద్యం చేస్తుండడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా క్లినిక్‌లను మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు.ఆదిలాబాద్ జిల్లాలో కొందరు ఆర్‌ఎంపీలు ప్రభుత్వ అనుమతులు పొందకుండానే వైద్యశాలలు నిర్వహిస్తున్నారు. చిన్నపాటి అనారోగ్యానికి గురై వారి వద్దకు వెళ్తే రోగులను భయాందోళనకు గురి చేస్తున్నారు. అవసరం లేకున్నా పలు టెస్టులు చేయిస్తున్నారు. మందులు అంటగడుతున్నారు. వేలాది రూపాయలు వైద్యం పేరిట దోచుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దీంతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దస్నాపూర్, రాంనగర్‌లో ఆర్‌ఎంపీలు నిర్వహిస్తున్న దవాఖానల్లో డీఎంఅండ్ హెచ్‌వో నరేందర్ రాథోడ్, జిల్లా సర్వై లైన్స్ అధికారి వైసీ శ్రీనివాస్ తనిఖీ చేశారు. ముందుగా శ్రీ బాలాజీ పాలి క్లినిక్‌ను తనిఖీ చేశారు. కొంతసేపటికి వచ్చిన ఓ వ్యక్తి తాను డాక్టర్‌నని చెప్పాడు. అధికారులు అతడి వైద్య వృత్తికి సంబంధించి పత్రాలు అడుగడంతో కోల్‌కతాలో ఎంబీబీఎస్ (అల్టర్నేట్ మెడిసిన్) చదివానని, సర్టిఫికెట్లు ఇంట్లో ఉన్నాయని సమాధానమిచ్చాడు. అర్హత లేకున్నా వైద్యం ఎందుకు చేస్తున్నావని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టార్ క్లినిక్‌లో ఓ వైద్యుడు స్లైన్లు, ఇంజెక్షన్లు, మందులు ఇవ్వడంతో అతనిపై మండిపడ్డారు. శ్రీ బాలాజీ పాలి క్లినిక్, శ్రీరామ్ క్లినిక్, స్టార్ క్లినిక్‌లకు క్లోజర్ నోటీసులు జారీ చేయాలని డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఎం మహేందర్‌కు సూచించారు. ప్రసుత్తం ఈ మూడు క్లినిక్‌లను మూసి వేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డీఎంఅండ్‌హెచ్‌వో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న వైద్యశాలలు, ఆర్‌ఎంపీలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.