- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి):తెలంగాణలో కరోనా మరణాలకు ప్రభుత్వానికి పట్టవ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ఆయన ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆస్పత్రిని, సందర్శించారు. కొవిడ్ రోగులకు అందుతున్న చికిత్స, ఇతరులకు అందుతున్న వైద్యంపై అధికారులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా టెస్టులు చేసే పరికరాలే లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల్లో నమోదవుతున్న కేసులకు, ప్రభుత్వం విడుదల చేస్తున్న కొవిడ్ బులెటిన్‌కు పొంతన ఉండడం లేదని అన్నారు. ఆస్పత్రుల్లో కనీసం సిబ్బంది, డాక్టర్లు, బెడ్స్ లేవని చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీ జరుగుతున్నా ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రి పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పారా మెడికల్ సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. కరోనా వైరస్ పట్ల ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ప్రజల ప్రాణాలను గాలికొదిలేసిందని విమర్శించారు. కొవిడ్‌తో ప్రజలు పిట్టల్లా రాలిపోతే కనీస స్పందన కూడా లేదని మండిపడ్డారు.