సెప్టెంబరు ఆఖరు కల్లా 300 బస్తీ దవాఖానలు

రోజుకు 25 వేల మందికి ప్రాథమిక వైద్యం..


బస్తీ దవాఖానలపై సమీక్షలో మంత్రి కేటీఆర్‌ 


హైదరాబాద్(ఆరోగ్యజ్యోతి):  హైదరాబాద్ ‌లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలు విజయవంతంగా కొనసాగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో 198 బస్తీ దవాఖానలు కొనసాగుతున్నట్లు.. వీటికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు ఆయన తెలిపారు.  డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించిన ప్రాంతాల్లో సైతం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తామన్నారు. సెప్టెంబర్‌ ఆఖరుకల్లా.. మరో వంద బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శుక్రవారం బుద్ధభవన్‌లోని ఈవీడీఎం కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ, గ్రేటర్‌లోని జిల్లాల కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులతో బస్తీ దవాఖానలపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తీ వైద్యశాలల్లో ప్రభుత్వం నాణ్యమైన సేవలు అందిస్తున్నదన్నారు. అంతేకాక పేదలు ఉండేచోట వీటిని ఏర్పాటు చేయడంతో మంచి ఆదరణ లభిస్తున్నదన్నారు. వీటిలో ప్రాథమిక వైద్య సేవలు పూర్తి ఉచితంగా అందిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు దశలవారీగా బస్తీ దవాఖానలను 300లకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒక్కో బస్తీ దవాఖానకు ప్రస్తుతం 100మంది వరకు వస్తున్నారని.. 198 వైద్యశాలల్లో రోజుకు 25వేల మంది వైద్య సేవలు పొందుతున్నారన్నారు. పేదలు ఉండే ప్రతి డివిజన్‌లో బస్తీ వైద్యశాలలు ఉండాలన్నదే తమ లక్ష్యమని.. అవసరమైన చోట రెండు లేదా మూడు దవాఖానలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బస్తీ వైద్యశాలలతో పాటు 130కి పైగా అర్బన్‌ పీహెచ్‌సీలు ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్నాయన్నారు. వైద్య పరీక్షలు కూడా ఉచితంగా అందజేస్తున్నాయన్నారు. హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని బస్తీ దవాఖానలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో నమోదైనట్లు.. మిగిలిన వాటిని కూడా త్వరలో ఆన్‌లైన్‌లో నమోదు చేసి అక్కడ అందుతున్న సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. బస్తీ దవాఖానలు విజయవంతమైన నేపథ్యంలో డబుల్‌ బెడ్‌రూం కాలనీలు నిర్మించిన ప్రాంతాల్లోనూ వీటిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ వైద్య సేవలతో పాటు వైద్య పరీక్షలను సైతం ఉచితంగానే అందిస్తున్నామని మంత్రి దృష్టికి తెచ్చారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రతిరోజు 5000 వైద్య పరీక్షలు చేస్తున్నామని.. వీటి సంఖ్యను మరింత పెంచేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రైవేట్‌ డయోగ్నాస్టిక్‌ సెంటర్లకు ఏమాత్రం తీసిపోకుండా నాణ్యమైన పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. బస్తీ దవాఖానలు ఉన్న ప్రాంతాల్లో మూత్రశాలల కొరత ఉన్నట్లు.. వాటిని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఒక వేళ మూత్రశాలలు నిర్మించేందుకు స్థలం లేని పక్షంలో మొబైల్‌ టాయిలెట్లను ఏర్పాటు చేస్తామన్నారు. బస్తీ వైద్యశాలల్లో అందుతున్న వైద్యసేవలు, వైద్య పరీక్షలపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. వీటిని మరింత ప్రభావవంతంగా కొనసాగించాలని అధికారులకు సూచించారు.