హైదరాబాద్ (ఆరోగ్యజ్యోతి): గాంధీ ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది.. కరోనా సమయంలో గాంధీలో చాలా వివాదాస్పద ఘటనలు చోటు చేసుకోగా.. ఇవాళ కరెంట్ పోవడం చర్చగా మారింది. ఆస్పత్రిలో కొద్దిసేపే కరెంట్ పోగా.. కరోనా వార్డులో దాదాపు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్టుగా చెబుతున్నారు.. దీంతో పేషంట్లు చీకటిలోనే ఇబ్బంది పడగా.. వైద్య సిబ్బంది సైతం రోగులకు చికిత్స అందించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారనే ప్రచారం సాగింది.. అయితే ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.. వెంటనే అక్కడికి జనరేటర్ పంపాల్సిందిగా ఆదేశించారు. కోవిడ్ ఆస్పత్రులతో పాటు అన్ని ఆస్పత్రుల్లో జనరేటర్లు చెక్ చేసి పెట్టుకోవాలని.. సరైన డీజిల్ నిల్వలు కూడా ఉండే విధంగా చూసుకోవాలని ఆదేశించారు. ఇక, పవర్ కట్‌పై స్పందించిన గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు.. ఆస్పత్రిలో సాయంత్రం 5.35 గంటలకు ఉన్నట్టుండి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని.. తిరిగి 5.56 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడింది అని తెలిపారు.. అయితే, ఆస్పత్రిలోని జనరేటర్లు సాయంత్రం 5:42 గంటలకు పనిచేయడం ప్రారంభించాయని వెల్లడించారు. అంటే.. ఆస్పత్రిలో ఏడు నిమిషాలు మాత్రమే పవర్ నిలిచిపోయినట్టు వివరణ ఇచ్చారు.. అంతే కాదు.. ఐసీయూతో పాటు.. ఇతర రోగులున్న వార్డుల్లో కూడా ఎలాంటి సమస్యలు రాలేదని చెప్పారు డాక్టర్ రాజారావు.