విధి నిర్వహణలో అప్రమత్తత అవసరం

గోల్నాక, (ఆరోగ్యజ్యోతి):  పోలీసులు కరోనా బారినపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, విధి నిర్వహణలో నిరంతరం  అప్రమత్తంగా ఉండాలని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ కోరారు. బుధవారం అంబర్‌పేట సీపీఎల్‌ మైదానంలో పోలీసుల వాహనాలకు శాటిటైజేషన్‌ డ్రైవ్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  హైదరాబాద్‌ కమిషనరేట్‌కు చెందిన అన్ని పోలీస్‌ వాహనాలకు శానిటైజ్‌ చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన సంస్థలకు  కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో కరోనా తీవ్రత, మరణాల సంఖ్య తక్కువగానే ఉందన్నారు. అనంతరం రైల్వే అధికారులతో సీపీ అంజనీకుమార్‌ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.  సేఫ్టీ అండ్‌ సెక్యూరిటీ అంశాలతో పాటు సిటీ, రైల్వే పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. రైల్వేస్టేషన్లలో ఆటోలు, ట్యాక్సీ పార్కింగ్‌లు,  ప్రీ పెయిడ్‌ ఆటో, ట్యాక్సీ సర్వీసెస్‌, రైల్వే స్టేషన్‌ పరిసరాలలో మరిన్ని సీసీ కెమెరాల ఏర్పాటు, రైల్వే కాలనీలలో పెట్రోలింగ్‌కు సంబంధించిన తదితర అంశాలపై చర్చించామని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. ఈ సమావేశానికి హాజరైన  ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీ అధికారులకు సీపీ జ్ఞాపిక అందించారు.