తిమ్మాపూర్,కరీంనగర్ (ఆరోగ్యజ్యోతి): తిమ్మాపూర్ గ్రామంలో కరోనా కలకలం రేపింది. హైదరాబాద్ వైద్య శాఖలో డ్రైవర్‌గా పని చేసే ఓ వ్యక్తి కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షల కోసం నమూనాలు ఇచ్చాడు. గురువారం తిమ్మాపూర్‌లోని బంధువుల ఇంటికి భార్యతో కలిసి వచ్చాడు. తెల్లవారి శుక్రవారం సాయంత్రం వరకు పాజిటివ్ రావడంతో ఆ రాత్రే కరీంనగర్ రాంపూర్‌లోని తమ నివాసానికి వెళ్లారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి బంధువు వీవో అధ్యక్షురాలు కాగా, తమ సంఘం సభ్యులు 20మందితో కలిసి ఆమె శనివారం సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. విషయం తెలియడంతో వైద్యసిబ్బంది గ్రామానికి చేరుకుని వారందరినీ హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. కరోనా వచ్చిన వ్యక్తి తిరిగిన ప్రాంతంతో పాటు ప్రధాన వీధుల్లో సర్పంచ్ దుండ్ర నీలిమరాజయ్య సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. గ్రామస్తులు ధైర్యంగా ఉండాలని ఆందోళనకు గురికావద్దని సర్పంచ్ సూచించారు.