లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రికి పంపాలి

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్


ఆదిలాబాద్ , (ఆరోగ్యజ్యోతి):  కరోనా రోగుల సేవల్లో ఇక నుంచి ఆర్‌ఎంపీలు సైతం కీలకపాత్ర పోషించనున్నట్లు


జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ అన్నారు. ఈ మేరకు ఆర్‌ఎంపీ, పీఎంపీలకు బుదవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి  సమావేశ మందిరంలో ఆర్‌ఎంపీలు, పీఎంపీలుఅవగాహన సదసును నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఆర్‌ఎంపీలు, పీఎంపీలు రోగులకు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని, కరోనాపై అవగాహన లేకుండా చికిత్స చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరించారు. రోగుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వారిని స్థానిక యూపీహెచ్‌సీలకు లేదా ప్రభుత్వ దవాఖానలకు రిఫర్‌ చేయాలని సూచించారు. రోగుల వివరాలు సేకరించి వెంటనే సంబంధిత వైద్యాధికారులకు సమాచారం అందించాలన్నారు. కరోనా రోగులకు అవగాహన కల్పిస్తూ అండగా నిలవాలన్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో సైతం వైరస్‌ వ్యాపిస్తుండటంతో కొందరు రోగులు అవగాహనాలోపంతో అనారోగ్యానికి గురై మృత్యువాత పడటం, అవసరం లేని పరీక్షలు చేయించుకుంటూ భయబ్రాంతులకు గురవుతున్నారన్నారు. అలాంటి రోగులకు తగిన సలహాలు, సూచనలు చేస్తూ కరోనా వైరస్‌పై అవగాహన కల్పించాలని, లక్షణాలున్న రోగులను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆరోగ్యకేంద్రాలకు తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలోడి ఎస్ ఓ డాక్టర్ వై సి శ్రీనివాస్, జిల్లా కుటుంబ నియంత్రణ  అధికారి  డాక్టర్ ఆనంద్, ఆర్‌ఎంపీ, పీఎంపీలు తదితరులు పాల్గొన్నారు.