కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండండి

 





  • ద్వితీయ శ్రేణి నగరాలు జాగ్రత్తగా ఉండాలి

  • దవాఖాన ఏదైనా ఒకే వైద్యం

  • ప్రభుత్వ, ప్రైవేటు తేడా లేదు

  • హైదరాబాద్‌వరకు రావొద్దు

  • ఇంట్లోనే 70% మంది రికవరీ

  • మీడియాతో వైద్యశాఖ అధికార్లు


-  వైద్య విద్యా డైరెక్టర్‌ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి,


-  ప్రజారోగ్య విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసరావు 


హైదరాబాద్‌, (ఆరోగ్యజ్యోతి): రానున్న నాలుగైదు వారాల్లో కరోనా కేసులు అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు హెచ్చరించారు. అయితే కరోనా గురించి ఎలాంటి భయాందోళనలు అవసరంలేదని, కేవలం ఐదుశాతం మంది లోనే తీవ్రమైన లక్షణాలు ఉంటున్నాయని మరణించిన వారిలో వీరే ఉన్నారని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌ కోఠిలోని మీడియాతో మాట్లాడారు. దవాఖాన ఏదైనా కరోనాకు అందించే వైద్యం మాత్రం ఒకటేనని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. లక్షలు చెల్లించి ప్రైవేటు దవాఖానల్లో పొందే వైద్యానికి, ప్రభుత్వ దవాఖానల్లో ఉచితం గా పొందే వైద్యాన్ని ఎలాంటి వ్యత్యాసం లేదని పేర్కొన్నారు. ప్రపంచంలో, దేశంలో అందిస్తున్న చికిత్సనే రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచితంగా ఇస్తున్నట్టు తెలిపారు. తక్కువఖర్చుతో అయ్యే వై ద్యానికి ప్రైవేటు దవాఖానలకు వెళ్లి లక్షలు వృథా చేసుకోవద్దని విజ్ఞప్తిచేశారు. స్వల్ప లక్షణాలు ఉన్న వేలమంది హోంఐసొలేషన్‌లో ఉండి చికిత్స పొం దుతున్నారని వివరించారు. లక్షణాలు ఉన్నవారు హైదరాబాద్‌ దాకా రావాల్సిన అవసరం లేదని, జిల్లాస్థాయిలో చికిత్సను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. హైదరాబాద్‌ దవాఖానల్లో వినియోగించే ఔషధాలనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ దవాఖానలకు చేరవేసినట్టు వివరించారు. 



సీఎం కేసీఆర్‌ పరిస్థితులను సమీక్షిస్తూ సూచనలు చేస్తున్నారని, అత్యవసర సమయాల్లో వినియోగించుకునేందుకువైద్యారోగ్యశాఖకు రూ.100 కోట్లు కేటాయించారని అధికారులు వివరించారు. టీచింగ్‌ దవాఖానల్లో సీనియర్స్‌ రెసిడెంట్స్‌ని నియమించుకొనేందుకు అవకాశం ఇచ్చారన్నారు. అన్నిశాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, ప్రాణాలకు తెగించి నిర్విరామంగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఇంతచేస్తున్నా విమర్శించడం బాధ కలిగిస్తున్నదని పేర్కొన్నారు. కరోనాతో ప్ర పంచమంతా అతలాకుతలం అవుతున్నదన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. రాష్ట్రంలో పరిస్థితి చాలా మెరుగ్గా ఉన్నదని, మరణాల రేటు విషయంలో జాతీయసగటు 2.5 ఉంటే, రాష్ట్రంలో 0.88ఉన్నదని చెప్పారు. రాష్ట్రంలో 99 శాతంపైగా కోలుకుంటున్నారని, నికరంగా చూస్తే రాష్ట్రంలో రికవరీరేటు 76 శాతంపైగా ఉన్నదని వివరించారు.ఇప్పటికే 3 లక్షలకు పైగా పరీక్షలు నిర్వహించామని, ఇందులో ఆర్టీపీసీఆర్‌, యాంటిజన్‌ పరీక్షలున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి 10 లక్షల మందికి 8,321 పరీక్షలు చేస్తున్నామని, గతంలో కంటే ఇది ఎంతో మెరుగైందని చెప్పారు. పరీక్షల సంఖ్య పెంచామని, 2 లక్షల యాంటీజన్‌ కిట్లు తెప్పించామని, మరో 2 లక్షలు తెప్పిస్తున్నట్టు వివరించారు. 13ప్రభుత్వ, 23 ప్రైవేటు ల్యాబ్‌ల లో వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అన్నిజిల్లాల్లో పీహెచ్‌సీ సెంటర్లు, జీహెచ్‌ఎంసీలో బస్తీ దవాఖానల్లోనూ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. నిత్యం 15వేల పరీక్షలు నిర్వహిస్తున్నామని, దీనిని 25 వేలకు పెంచేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో 8,399 పడకలు, ప్రైవేటులో 4,241 పడకలు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెప్పారు. ప్రజలు ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని, ప్రైవేటు దవాఖానల చుట్టూ తిరిగి విలువైన సమయం వృథా చేసుకోవద్దని, గోల్డెన్‌ అవర్‌ మిస్‌ కావటం వల్ల ప్రాణాలు కోల్పేయే పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. సాధారణ లక్షణాలు ఉన్నవారికి అందించేది చాలా సింపుల్‌ వైద్యమని, రూ.200 ఖర్చుతో అయిపోతుందన్నా రు. అయినా ప్రైవేటు దవాఖానల్లో రూ.లక్షలు వసూలుచేయడం దారుణమని చెప్పారు. 


సీజనల్‌ వ్యాధులతో జాగ్రత్త


వర్షాలు, దోమలద్వారా సీజనల్‌ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నదని, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే కరోనా అని ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు. నిర్లక్ష్యం చేయకుం డా సమీప కేంద్రాల్లో టెస్టులు చేయించుకోవాలన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించడం వల్ల కరోనాతోపాటు సీజనల్‌ వ్యాధులను అరికట్టవచ్చని చెప్పారు. 49వేల పాజిటివ్‌ కేసుల్లో వైద్యారోగ్యశాఖకు చెందినవారు వెయ్యిమందికిపైగా ఉన్నారని, వైద్యసిబ్బంది, వారి కుటుంబసభ్యులు కూడా వైరస్‌ బారినపడ్డారని తెలిపారు. 


ప్రైవేటు దవాఖానలపై ఫిర్యాదులు


104 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసి, ఆరోగ్యపరమైన సలహాలు, సూచనలు పొందవచ్చని వైద్యాధికారులు సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్‌ లు, దవాఖానల్లో ఫిర్యాదుల కోసం వాట్సాప్‌ నంబర్‌ 9154170960 ఏర్పాటుచేశామని, నిత్యం 120వరకు ఫిర్యాదులు వస్తున్నాయన్నా రు. ప్రైవేటు దవాఖానల్లో ఎక్కువ చార్జీలు, ఇన్సూరెన్స్‌ అనుమతించకపోవడం, నగదురూపంలో మాత్రమే చెల్లింపులుచేయడం, పడకల సమస్యల పై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తున్నామని వివరించారు. దవాఖానలు, ల్యాబ్‌లపై నిరంతరం నిఘా ఉంచేందుకు ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటుచేసినట్టు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించడంలో అలసత్వం చూపితే సీజ్‌చేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు.