వృద్దాశ్రమంపై కరోనా పంజా..

- ఏకంగా 25 మందికి పాజిటివ్


కరీంనగర్(ఆరోగ్యజ్యోతి):కరోనా వైరస్ విలయం కొనసాగుతూనే వుంది. తాజాగా కరీంనగర్‌ లోని ప్రముఖ వృద్దాశ్రమంపై కరోనా వైరస్‌ పంజా విసిరింది. ఏ దిక్కు లేక వృద్దాశ్రమంలో ఉంటున్న వారిపై కరోనా కోరలు చాచింది.  ఆశ్రమంలో ఉంటున్న 40 మంది వృద్ధుల్లో 25 మందికి కరోనా వైరస్‌ సోకింది.  అందులో ఇద్దరు చనిపోయారు. మిగతా 15 మంది వృద్ధులకు కరోనా పరీక్షలు నిర్వహించి నెగెటివ్‌ రావడంతో ఇళ్లకు తీసుకెళ్లాలని వారి బంధువులకు సమాచారమందించారు. వృద్ధాశ్రమానికి తాళం వేసి కరోనా బారిన పడ్డ 23 మందిని శాతవాహన యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు. కంటికి రెప్పలా కాపాడవలసిన ఆశ్రమ నిర్వహకులు పండుటాకులను ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వారు కరోనా బారిన పడడానికి కారణమైందని జిల్లా యంత్రాంగం భావిస్తున్నది. వారిపై చర్యలు తీసుకోవడానికి వీలుగా కేసు నమోదుకు సమయాత్తమైనట్లు సమాచారం.