హైదరాబాద్(ఆరోగ్యజ్యోతి): కరోనా బాధితులకు చికిత్స అందించడంలో భాగంగా టిమ్స్, గాంధీ ఆసుపత్రుల్లో ఒప్పంద, పొరుగు సేవల విధానంలో మంజూరైన పోస్టుల భర్తీని ప్రభుత్వం చేపట్టింది. ఎంపికైన అభ్యర్థులు వెంటనే కేటాయించిన ఆసుపత్రుల్లో చేరాలని సూచించింది. నియామక ప్రక్రియలో అనుసరించిన విధానాన్ని వైద్యఆరోగ్యశాఖ మంగళవారం ఒక ప్రకటనలో వివరించింది. అయితే రెండు ఆసుపత్రులకూ మంజూరు చేసిన పోస్టుల్లో అత్యధికం ఖాళీగానే మిగిలాయి.
టిమ్స్: భారీగా దరఖాస్తులు.. ఖాళీగా పోస్టులు
టిమ్స్‌లో ఒప్పంద ప్రాతిపదికన 499 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించగా.. 13,090 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నియామకాలు చేపట్టారు. అయితే నియమితులైన వారిలో దాదాపు 50 శాతం మంది పోస్టుల్లో చేరలేదు. టిమ్స్‌లో సేవలను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుండడంతో.. మరోసారి ఖాళీల భర్తీపై వైద్యఆరోగ్య శాఖ దృష్టి సారించింది.
గాంధీ: అంతంతమాత్రంగానే దరఖాస్తులు
గాంధీని ప్రత్యేక కొవిడ్ ఆసుపత్రిగా ప్రకటించడంతో ఇక్కడ అదనపు మానవ వనరుల అవసరం ఏర్పడింది. ప్రభుత్వం పొరుగు సేవల విధానంలో 665 పోస్టుల భర్తీకి అనుమతించింది. తొలుత 4 నెలల కాలపరిమితికే నియామక ప్రకటన వెలువడింది. అయితే ఆశించిన రీతిలో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు రాలేదు. దాదాపు 86 స్పెషలిస్టు పోస్టులు, 155 మెడికల్ ఆఫీసర్ల పోస్టులకు గాను కేవలం 19 మంది మెడికల్ ఆఫీసర్లు మాత్రమే చేరారు. దీంతో ఉద్యోగ కాలపరిమితిని ప్రభుత్వం ఏడాదికి పెంచింది.