పరీక్షల కోసం రిమ్స్‌కు తరలింపు

ఆదిలాబాద్, జైనథ్‌(ఆరోగ్యజ్యోతి) : మండలానికి చెందిన ఓ వృద్ధురాలికి కరోనా పాజిటివ్‌ రాగా కుటుంబ సభ్యులతో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న తొమ్మిది మందిని పరీక్షల కోసం రిమ్స్‌కు తరలించినట్లు గిమ్మ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు నిర్మల తెలిపారు. బుధవారం ఉదయాన్నే తహసీల్దార్‌ మహేంద్రనాథ్‌, ఎస్సై సాయిరెడ్డి వెంకన్నతో పాటు ఎంపీపీ మార్సెట్టి గోవర్ధన్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ బాలూరి గోవర్ధన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి సదరు గ్రామాన్ని సందర్శించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నర్సులు ఇంటింటికీ తిరుగుతూ సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామంలో జ్వరాలు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారి వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. గ్రామంలో వైద్యులు, పోలీసులను నియమించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దార్‌ మహేంద్రనాథ్‌ తెలిపారు.