జీతం పెంచకుంటే పనిచేయం.. 14 ఏళ్లుగా పనిచేస్తున్నా రూ.17 వేలే
కొత్తగా చేరేవారికి 25 వేల జీతం..డీఎంఈ ఆఫీసు ఎదుట ధర్నాలు
హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి): జీతాలు పెంచాలని ఏళ్ల తరబడి కోరుతున్నాం. 14 ఏళ్ల సీనియారిటీ ఉన్నా.. రూ. 15 వేల నుంచి రూ. 17వేలకు మించి జీతాలు ఇవ్వడం లేదు. కొవిడ్‌లో రెండు నెలలు జీతాలు లేకున్నా సేవలందించాం. ఇప్పుడు కొవిడ్ సేవలకు కొత్తగా రిక్రూట్‌మెంట్లు చేస్తున్నారు. ఐదేళ్ల సీనియారిటీ ఉన్నవారికి రూ. 25 వేల నుంచి రూ. 28 వేల జీతం ఇస్తామంటున్నారు. పైగా.. వారికి హెడ్‌నర్స్ పోస్టింగ్ ఇస్తామని ప్రకటించారు. అంటే.. 14 ఏళ్ల సీనియర్లమైన మేము.. 5 ఏళ్ల జూనియర్ల కింద పనిచేయాలా? జీతం పెంచకుంటే మేం పనిచేయం అని గాంధీ ఆస్పత్రికి చెందిన పలువురు ఔట్‌సోర్సింగ్ నర్సులు భీష్మించారు. ఉన్నపళంగా విధులను మానేస్తామని హెచ్చరించి, రాజీనామాలకు సిద్ధపడ్డారు. ఈ మేరకు కోఠిలోని వైద్య విద్య సంచాలకుడి(డీఎంఈ) కార్యాలయం ముందు 3రోజులుగా ధర్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 30మంది నర్సులు ఉద్యోగాలకు రాజీనామా చేసినట్లు తెలిసింది.
ఎప్పటి నుంచో ఆందోళన
జీతాలు పెంచాలంటూ ఔట్‌సోర్సింగ్ నర్సులు చాలాకాలంగా ఆందోళన చేస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలోని 220మంది ఔట్ సోర్సింగ్ నర్సులు 4నెలల క్రితం ఆందోళన చేయగా.. సమస్యను పరిష్కరిస్తామంటూ మంత్రి ఈటల వారికి సర్దిచెప్పారు. తాజాగా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బోధనాస్పత్రుల్లో 2వేల మంది నర్సులను తాత్కాలికంగా నియమించాలని, వారికి సుమారు రూ. 28 వేల వరకు వేతనం ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇదే సీనియర్ నర్సుల ఆందోళనకు కారణమైంది. ఈ నేపథ్యంలో డీఎంఈ డాక్టర్ రమేశ్ రెడ్డి ప్రభుత్వానికి శుక్రవారం ఓ నివేదిక పంపారు. ఔట్‌సోర్సింగ్ నర్సులకు తక్కువ వేతనాన్ని చెల్లిస్తున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వారి డిమాండ్‌ను వెంటనే పరిష్కరించాలని కోరారు.
నర్సుల అరెస్టు
గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న 80మంది నర్సులు శనివారం ఉదయం డీఎంఈ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. తమ కొలువులను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం రమేశ్‌రెడ్డి వారితో చర్చించి, వెంటనే ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తానని హామీ ఇచ్చారు. ఔట్‌సోర్సింగ్ కొలువులను క్రమబద్దీకరించడం కుదరదని చెప్పడంతో.. ఆందోళన విరమించేది లేదని నర్సులు తేల్చిచెప్పారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. కాగా.. కొవిడ్ చికిత్స తీరుపై డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి శుక్రవారం పలు కమిటీలను వేశారు. కొవిడ్ ల్యాబ్స్ నోడల్ అధికారిగా డాక్టర్ వాణి, ల్యాబ్ కన్జ్యూమబుల్స్ మానిటరింగ్‌కు డాక్టర్ రమాదేవీ, ఆక్సిజన్ పైప్‌లైన్ వ్యవహరాలకు సంబంధించి డాక్టర్ విజయసారథి, కరోనాకు సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసే బాధ్యతలను డాక్టర్ జయరాంరెడ్డి, విక్రమ్‌కుమార్, ఆస్పత్రుల్లో పడకల వివరాలపై డాక్టర్ లక్ష్మణ్‌రావు ఆధ్వర్యంలో ఈ కమిటీలను వేశారు.