గ్రామాల్లో కరోనా కలకలం

శంకరపట్నం కరీంనగర్ (ఆరోగ్యజ్యోతి): మండల కేంద్రంలో ఆదివారం కరోనా కలకలం సృష్టించింది. ఓ వ్యక్తికి పాజిటివ్‌ రావడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఉదయం వైద్యాధికారి షాకీర్‌ అహ్మద్‌, ఎస్‌ఐ రవి, వైద్య సిబ్బందితో రోగి ఇంటికి వెళ్లారు. హోం ఐసోలేషన్‌లో ఉండాలని ఆదేశించారు. తీసుకోవాల్సిసిన జాగ్రత్తలు, నిబంధనలు వివరించారు. అలాగే తొమ్మిది మంది రోగి కుటుంబ సభ్యులతో పాటు అతడితో ఫస్ట్‌ కాంటాక్ట్‌లో ఉన్న మరో నలుగురిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. కరోనా ఎఫెక్ట్‌తో కేశవపట్నం పంచాయతీ పాలకవర్గం అత్యవసర సమావేశమైంది. ఈ నెల 14 వరకు కేశవపట్నంలో సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ పాటించాలని నిర్ణయించింది. అనంతరం 15 నుంచి 30వ తేదీ వరకు కిరాణా, కూరగాయలు, పాలు, తదితర అత్యవసరాల కోసం ఉదయం 6 నుంచి 9 గంటల వరకు సడలింపు ఇస్తూ సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ను కొనసాగించాలని తీర్మానించారు. ఆంక్షలు అతిక్రమిస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు. అలాగే ఈ నెల 20 వరకు సెలూన్లు బంద్‌ చేస్తున్నట్లు నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ప్రకటనలో తెలిపింది.