95% మందికి ఇబ్బందిలేదు

 





  • 95% మందికి ఇబ్బందిలేదు

  • తీవ్ర లక్షణాలున్న 5 శాతం మందిపై ప్రత్యేక దృష్టి

  • ముందే గుర్తించి.. ప్రాణాలు కాపాడాలి

  • హాస్పిటల్‌, డైట్‌ కాంట్రాక్టర్ల బకాయిలు చెల్లిస్తాం

  • వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌


హైదరాబాద్‌,(ఆరోగ్యజ్యోతి): 95 శాతం మంది కరోనా బాధితులకు ఎలాంటి సమస్య ఉండదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టంచేశారు. తీవ్రమైన వైరస్‌ లక్షణాలున్న మిగతా ఐదుశాతం మందిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గురువారం బీఆర్కే భవన్‌నుంచి వైద్యవిధానపరిషత్‌ ఆధ్వర్యంలో ఉన్న దవాఖాన సూపరింటెండెంట్లు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 104 వైద్యవిధానపరిషత్‌ హాస్పిటళ్ల పనితీరును సమీక్షించి, పలు సూచనలు చేశారు. 99 శాతం మంది బాధితులకు వెంటిలేటర్‌, రెమ్డిసివిర్‌ వంటి మందులు అవసరంలేదని తెలిపారు. ‘ముందుగా గుర్తిద్దాం.. చావులను అరికడదాం’ అనే విధానం పాటించాలని సూచించారు. భయంతో చాలామంది చనిపోతున్నారని, యాంటీ ఇన్‌ఫ్ల్లమేటరీ మందులు సకాలంలో ఉపయోగించడం వల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చని తెలిపారు. 24 గంటలపాటు తాను అందుబాటులో ఉంటానని, ప్రతి ఒక్క వైద్యాధికారి పూర్తి సామర్థ్యంతో పనిచేయాలని సూచించారు. అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని చెప్పారు. హాస్పిటళ్లకు ఉన్న అన్ని బకాయిలు, డైట్‌ కాంట్రాక్టర్ల బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆక్సిజన్‌ సిలిండర్లు ఇక్కడినుంచే పంపిస్తామని చెప్పారు. సమావేశంలో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేశ్‌రెడ్డి, వీసీ కరుణాకర్‌రెడ్డి, డాక్టర్‌ గంగాధర్‌ పాల్గొన్నారు.