100లో 22 మందికి కరోనా.. పాజిటివ్ రేటు తెలంగాణలో ఎక్కువ

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి) దేశంలో ఎక్కడా లేనంతగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. చేసిన కొన్ని టెస్టుల్లోనే ఎక్కువ కేసులు బయటపడుతున్నాయి. టెస్టులు పెంచేకొద్దీ ఆ కేసులు ఎక్కువ అవుతున్నాయి. పది రోజులుగా టెస్టులు చేయించుకున్న ప్రతి వంద మందిలో 28 మందికి పాజిటివ్​ వస్తోందంటే పరిస్థితి ఎంత సీరియస్​గా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్​ రేటు 22 శాతంగా ఉంది. ఇప్పటిదాకా రాష్ట్ర సర్కారు ప్రకటించిన కేసులు 31 వేల దాకా ఉండగా, ప్రకటించనవి మరో 3 వేలకుపైగానే ఉన్నాయి. ఈ కేసుల లెక్కతో పాటే రికవరీ రేటు, యాక్టివ్​ కేసులు, డెత్​ రేట్లలోనూ ఎన్నో లొసుగులున్నాయి. కరోనా సోకి పది రోజులైనా కాకముందే వారిని కోలుకున్నోళ్ల జాబితాలో చేరుస్తున్నది సర్కార్​.


దేశంలో పాజిటివ్​ రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణే. ఇప్పటిదాకా రాష్ట్రంలో లక్షా 40 వేల టెస్టులు చేస్తే 30,944 కేసులొచ్చాయి. అంటే 22 శాతం మందికి కరోనా సోకింది. 2 లక్షలకు పైగా కేసులు నమోదైన మహారాష్ట్రలోనూ పాజిటివ్​ రేటు ఇంతలా లేదు. అక్కడ పాజిటివ్​ రేట్​ 19 శాతం. ఆ రాష్ట్రంతో పోలిస్తే మన రాష్ట్రంలో 3 శాతం ఎక్కువగా ఉంది పాజిటివ్​ రేట్​. 15 శాతం పాజిటివ్​ రేటుతో ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. మన పక్క రాష్ట్రం ఏపీలో అది కేవలం 2 శాతమే కావడం గమనార్హం. మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ పాజిటివ్​ రేటు 10 శాతం లోపే ఉంది.


మరణాలు ఒక శాతమేనట!


ఆరోగ్యశాఖ విడుదల చేస్తున్న కరోనా మరణాల లెక్కలు ఫ్రంట్​లైన్​ వారియర్స్​ అయినా డాక్టర్లకే విస్తుగొలిపేలా ఉంటున్నాయి. రోజూ తమ కళ్లెదుటే పదుల మంది ప్రాణాలు కోల్పోతుంటే, బులెటిన్​లో మాత్రం అందులో సగం కూడా ప్రకటించడం లేదని డాక్టర్లు చెబుతున్నారు. ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం గురువారం నాటికి కరోనాతో 331 మంది మరణించారు. అంటే, మొత్తం కరోనా బాధితుల్లో ఒక శాతం మంది మాత్రమే చనిపోయినట్టు లెక్క. కరోనా డెత్​రేట్​ దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా 2 నుంచి 4 శాతం దాకా ఉంది. కానీ, ఒక్క మన రాష్ట్రంలో మాత్రం ఒక్క శాతమే ఉండడం లెక్కల్లో తేడాలను ఎత్తి చూపుతున్నది.


అడ్డదారిలో యాక్టివ్​ కేసులు తగ్గిస్తున్నరు


కరోనా పేషెంట్ల సంఖ్య నానాటికీ పెరుగుతుండడంతో యాక్టివ్​ కేసుల సంఖ్యను తక్కువగా చూపించేందుకు ఆరోగ్య శాఖ అడ్డదారులు తొక్కుతున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైరస్​ సోకి పది రోజులు కూడా కాకముందే వేల మంది పేషెంట్లను డిశ్చార్జ్​ జాబితాలోకి ఎక్కిస్తోంది సర్కార్​. పోయిన నెల 30వ తేదీ నుంచి గురువారం వరకూ పది రోజుల్లో 15,552 కేసులు నమోదయ్యాయి. ఐసీఎంఆర్​ రూల్స్​ ప్రకారం లక్షణాల్లేని పేషెంట్లైనా వైరస్​ సోకిన పది రోజుల తర్వాతే వారిని ఇన్​యాక్టివ్​ పేషెంట్లుగా భావించాలి. లక్షణాలున్నోళ్లను పూర్తిగా కోలుకున్న తర్వాతే ఇన్​యాక్టివ్​గా లెక్కించాలి. ఈ లెక్కన రాష్ర్టంలో గురువారం నాటికి 15,552 కంటే ఎక్కవ యాక్టివ్​ కేసులుండాలి. కానీ, పబ్లిక్​ హెల్త్​డైరెక్టర్​ గురువారం విడుదల చేసిన బులెటిన్​లో 12,423 యాక్టివ్​ కేసులు మాత్రమే ఉన్నట్టు పేర్కొన్నారు. అంటే, కనీసం 2 వేల మందిని వైరస్​ నుంచి కోలుకోకుండానే కోలుకున్నట్టు చూపించారు. పది రోజుల క్రితం వరకూ రాష్ర్టంలో కరోనా రికవరీ రేట్​ 50 శాతం కంటే తక్కువగా ఉంది. ఇదే టైమ్​లో దేశ రికవరీ రేట్​ 60 శాతం దాటింది. ఒకట్రెండు రాష్ర్టాలు మినహా మిగిలిన అన్ని రాష్ర్టాల్లోనూ రికవరీ రేట్​ మనకంటే మెరుగ్గా ఉంది. దీంతో వైరస్​ నుంచి కోలుకోని వాళ్లను కూడా కోలుకున్నట్టు చూపుతూ, రికవరీ రేట్​ను పెంచుతున్నారన్నది లెక్కలను బట్టి అర్థం  చేసుకోవచ్చు.


ఆ కేసుల లెక్క తేలేదెన్నడు?


విజయా డయాగ్నస్టిక్​ సెంటర్​‌లో టెస్ట్​ చేయించుకున్నవారిలో 2,672 మందికి వైరస్​ పాజిటివ్​ వచ్చింది. ఈ కేసులను ఇప్పటికీ హెల్త్​ బులెటిన్​లో ప్రకటించడం లేదు. విజయా ల్యాబులో టెస్ట్​ చేయించుకున్నోళ్లలో 70 శాతం మందికి పాజిటివ్​ వచ్చినందునే ఈ కేసులను లెక్కలోకి తీసుకోలేదని, ఆ ల్యాబులో చేసిన టెస్టుల్లో తప్పులేమైనా జరిగాయో అన్న దానిపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని పబ్లిక్​ హెల్త్​ డైరెక్టర్​ ప్రకటించారు. అయితే, పది రోజులు అవుతున్నా ఇప్పటికీ ఆ పరిశీలన పూర్తి కాలేదు. మరోవైపు తాము కరెక్ట్​గానే టెస్టులు చేశామని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.