కరోనాకు ‘పతంజలి’ ఔషధం


  • ధర రూ. 545.. వారంలో అందుబాటులోకి

  • ఔషధ సామర్థ్యం తెలిసే వరకూ ప్రచారం వద్దు: ఆయుష్‌


న్యూఢిల్లీ(ఆరోగ్యజ్యోతి): కరోనా మహమ్మారికి తొలిసారిగా ఆయుర్వేద ఔషధాన్ని తీసుకొచ్చినట్టు ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌కు చెందిన ‘పతంజలి’ సంస్థ పేర్కొంది. ‘కోరొనిల్‌' పేరుతో తీసుకొచ్చిన ఈ కరోనా కిట్‌లో కోరొనిల్‌, శ్వాసరి, అనుతేల్‌ అనే మూడు రకాల ఔషధాలు ఉంటాయని తెలిపింది. కరోనా రోగులపై నిర్వహించిన ఔషధ పరీక్షల్లో కోరొనిల్‌, శ్వాసరి ఔషధాలు వంద శాతం సత్ఫలితాలను ఇచ్చాయని వెల్లడించింది. హరిద్వార్‌లో మంగళవారం నిర్వహించిన ఔషధం ఆవిష్కరణ కార్యక్రమంలో రాందేవ్‌ మాట్లాడుతూ.. ‘ఈ ఔషధాన్ని వాడటం ద్వారా ఏడు రోజుల్లోనే సంపూర్ణంగా కోలుకోవచ్చు. పరీక్షల్లో భాగంగా ఈ ఔషధాన్ని 280 మంది రోగులపై ప్రయోగించాం. 69% మంది మూడు రోజుల్లోనే కోలుకున్నారు. మిగిలిన నాలుగురోజుల్లో ఇతరులూ  పూర్తిగా బయటపడ్డారు. కరోనా కిట్‌లో 30 రోజులకు అవసరమైన మందులు ఉంటాయి. వచ్చే సోమవారం నుంచి  ఇవి అందుబాటులో ఉంటాయి. అవసరమైన వాళ్లు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇవ్వాలి’ అని చెప్పారు.