న్యూఢిల్లీ: కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో రానున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఇండ్లల్లోనే జరుపుకోవాలని ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది థీమ్ (అంశం) ‘ఇంట్లో యోగా-కుటుంబంతో యోగా’ అని ఆయన వివరించారు. ఈసారి ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి యోగా చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 21న (ఆదివారం) ఆరో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగనున్నది.గత కొన్నేండ్లుగా యోగాకు ఆదరణ పెరగడం సంతోషాన్నిస్తున్నదని, యువత యోగా చేసేందుకు ముందుకు రావడం ఆహ్వానించదగ్గ విషయమని చెప్పారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని, కరోనా నుంచి ప్రపంచానికి విముక్తి లభించాక యోగా మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉందన్నారు.