న్యూఢిల్లీ(ఆరోగ్యజ్యోతి) : దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య మూడు లక్షలు దాటిన నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కొత్తగా క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రొటోకాల్స్ ఫర్ కోవిడ్ -19 ప్రకారం.. అత్యవసర సేవల కింద యాంటీ-వైరల్ డ్రగ్ రిమెడిసివిర్, ఇమ్యునోమోడ్యులేటర్ టొసిలిజుమాబ్, తప్పనిసరి పరిస్థితుల్లో ప్లాస్మా థెరపీని ఉపయోగించాలని మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది.పేషెంట్ల కండిషన్ సీరియస్ అయిన సందర్భాలలో మాత్రమే అజిత్రోమైసిన్‌తో కలిపి హైడ్రాక్సీక్లోరోక్విన్(హెచ్‌సీక్యూ)ను ఉపయోగించాలని గతంలో చేసిన సిఫార్సును మంత్రిత్వ శాఖ ఇప్పడు తొలగించింది. కరోనా సోకినట్లు తేలిన ప్రారంభ దశలోనే యాంటీ మలేరియా డ్రగ్ అయిన హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఉపయోగించవచ్చునని సూచించింది. వ్యాధి తీవ్రత పెరిగిన సందర్భాల్లోనే వాడకూడదని సిఫార్సు చేసింది. చాలా అధ్యయనాల తర్వాత హెచ్‌సీక్యూతో ఎలాంటి ప్రమాదం లేదని తేలినట్లు పేర్కొంది. ఇతర యాంటీ వైరల్ మందుల మాదిరిగానే వైరస్ సోకిన మొదట్లోనే హెచ్‌సీక్యూ వాడకం వల్ల ప్రయోజనం ఉంటుందని చెప్పింది. అయితే, తీవ్రమైన అనారోగ్యం ఉన్నవారు దీనిని వాడకుండా ఉండటం మంచిదని సూచించింది.