- విడుదల చేసిన గ్లెన్‌మార్క్
- డ్రగ్ కంట్రలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం
న్యూఢిల్లీ,(ఆరోగ్యజ్యోతి): ప్రపంచమంతా కరోనాతో అతలాకుతలం అవుతున్న వేళ, వైరస్‌ను నిరోధించే మందు ఇంకెప్పుడు వస్తుందా.. అని ఎదురు చూస్తున్న వేళ గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ శుభవార్త తెలిపింది. కరోనాపై ప్రభావవంతంగా పనిచేసే యాంటీవైరల్ ఔషధం ఫావిపిరావిర్‌ను ఫాబీఫ్లూ పేరుతో మార్కెట్‌లోకి తీసుకొస్తున్నట్టు శనివారం ప్రకటించింది. ముంబై కి చెందిన భారత ఫార్మా దిగ్గజ కంపెనీ గ్లెన్ మార్క్ ఫాబిఫ్లూ టాబ్లెట్ కు డ్రగ్ కంట్రలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది.ఈ ఔషధం స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్న కొవిడ్ రోగులపై ప్రభావవంతంగా పనిచేస్తుందని పేర్కొన్నది. మూడు దశల హ్యూమన్ ట్రయల్స్‌లో ఇది రుజువైందని వెల్లడించింది. ఈ ఔషధంతో 88% సత్ఫలితాలు వచ్చాయని తెలిపింది.ఇది వైరస్‌పై నాలుగు రోజుల్లోనే ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నది. మార్కెట్‌లో విడుదలకు అవసరమైన అనుమతులను శుక్రవారమే భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి పొందినట్టు వెల్లడించింది. ‘కొవిడ్ చికిత్స కోసం భారత ప్రభుత్వం అనుమతించిన మొట్టమొదటి ఓరల్(నోటితో తీసుకొనే) ఔషధం ఫాబీ ఫ్లూ’ అని గ్లెన్‌మార్క్ ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా ఈ ఔషధాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తాము కేంద్రప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్టు గ్లెన్‌మార్క్ చైర్మన్ గ్లెన్ సాల్డన్హా చెప్పారు. మధుమేహం, గుండెజబ్బులు ఉన్నవారు కూడా ఈ ఔషధాన్ని వాడవచ్చని ఆయన తెలిపారు. అయితే వైద్యుల ప్రిస్క్రిప్షన్, చికిత్సకు రోగి అనుమతిని బట్టే ఈ మందును అమ్మనున్నట్టు వెల్లడించారు.