మలేరియా ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక దృష్టి

ఆసిఫాబాద్‌(ఆరోగ్యజ్యోతి) :జిల్లాలో సీజనల్‌ వ్యాధుల నివారణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. యేటా వానకాలంలో  గిరిజన ప్రాంతాల్లో మలేరియా ప్రభావం ఎక్కువగా ఉంటున్నది. జిల్లాలో 79 మలేరియా ప్రభావిత గ్రామాలను గుర్తించిన అధికారులు, ముందస్తు చర్యలు చేపట్టారు. దోమల నివారణ కోసం ఐఆర్‌ఎస్‌(ఇండోర్‌ రెసిడెన్షియల్‌ స్ప్రే) పిచికారీ చేయనున్నారు. జిల్లాలోని 20 పీహెచ్‌సీల పరిధిలోని వైద్య సిబ్బందితో జిల్లా వైద్యాధికారి నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు. మలేరియా, డెంగీ, టైఫాయిడ్‌తో పాటు కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందిని  అప్రమత్తం చేస్తున్నారుజిల్లాలోని 15 మండలాల పరిధిలో  మారుమూల గిరిజన ప్రాంతాలే ఎక్కువ. వానకాలంలో వివిధ రకాల వ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఎక్కువే. ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి, ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల ద్వారా ఇప్పటికే చాలా వరకు గ్రామాలు పరిశుభ్రంగా మారాయి. గ్రామాల్లో చెత్తకుప్పలు లేకుండా చర్యలు తీసుకున్నారు. డంపింగ్‌ యార్డుల ఏర్పాటు ద్వారా పారిశుధ్యం లోపించకుండా చూసుకున్నారు. మురు గు కాలువల శుభ్రం, పిచ్చి మొక్కల తొలగింపు లాంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇదంతా వానకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చూసుకోవడంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం నిర్వహించింది. మరోవైపు వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం కూడా ముందస్తు చర్యలు చేపడుతున్నది. ముఖ్యంగా మలేరియా ప్రభావిత గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. జిల్లాలోని ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని 79 గ్రామాల్లో మలేరియా ప్రభావిత గ్రామాలు ఉండడంతో, ఈ గ్రామాల్లో  ఐఆర్‌ఎస్‌ స్ప్రే రెండు దఫాలుగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.