హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి) : తెలంగాణలో కరోనా వైరస్ విజృంభన రోజు రోజుకీ తీవ్రమవుతోంది. ప్రతి రోజు భారీ సంఖ్యలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3227 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 983 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. ఇవాళ నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 816 మంది ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో 47, మంచిర్యాలలో 33, మేడ్చల్‌లో 29, వరంగల్ రూరల్ జిల్లాలో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరంగల్ అర్బన్‌లో 12, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5, నల్లగొండ, కరీంనగర్, సిద్ధిపేట, ఖమ్మం జిల్లాల్లో మూడు చొప్పున కరోనా కేసులు వచ్చాయి. ఆదిలాబాద్, గద్వాల్ జిల్లాల్లో రెండేసి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, జనగామ, మెదక్, సూర్యాపేట, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. దీంతో తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,419కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం కరోనా మరణాలు 247కి పెరిగాయి. ఇవాళ 244 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాను జయించిన వారి సంఖ్య 5172కి చేరింది. ప్రస్తుతం 9 వేల మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు.