హైదరాబాద్(ఆరోగ్యజ్యోతి): ప్రజా రోగ్యంపై రాజీ పడే ప్రసక్తే లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉద్ఘాటించారు. కరోన సోకిన పేషెంట్లకు ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందిస్తుందని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేసినట్లు స్పష్టం చేశారు. ప్రజలకు వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రైవేటు ఆస్పత్రులపైన కూడా ఉందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు లోబడి ప్రైవేటు ఆస్పత్రులు చికిత్స చేయాలని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం సచివాలయంలో ఆయన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్‌తో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ లక్షణాలు ఉన్న వారిని మాత్రమే ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స చేయాలన్నారు. పాజిటివ్ ఉండి లక్షణాలు లేకుంటే హోంక్వారంటైన్, హోం ఐసొలేషన్లో ఉంచాలని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించొద్దన్నారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణించి ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతి ఇచ్చామని మంత్రి తెలిపారు. అరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని కోరగా... త్వరలో విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు సురేశ్‌కుమార్ (యశోద), భాస్కర్‌రావు (కిమ్స్), దేవానంద్ (అస్టర్ ప్రైమ్) తదితరులు పాల్గొన్నారు.