రాష్ట్రంలోనే మొదటి స్థానంలో
‘నార్మల్ డెలివరీ’లకు ప్రాధాన్యం
- అత్యవసరమైతే తప్ప ‘కోత’ల్లేవు..!
కొత్తగూడెం(ఆరోగ్యజ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ ఏడాది 9,834 మంది ప్రసవించారు. ఇందులో సాధారణ ప్రసవాలు 6048 ఉన్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అవసరమున్నా లేకున్నా ప్రతి గర్భిణి కడుపుకూ ‘కోత’ (సిజేరియన్), పర్సుకూ ‘కోత’ (వైద్య ఖర్చుల పేరుతో దోపిడీ) పెడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు ఇందుకు భిన్నం. ఇక్కడ నార్మల్ డెలివరీకే ప్రాధాన్యం. పైగా తిరిగి వెళ్లేటప్పుడు కేసీఆర్ కిట్ కూడా అందుతుంది. అందుకే, గర్భిణుల్లో అనేకమంది ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రి వైపే మొగ్గు చూపుతున్నారు.
సాధారణ ప్రసవాలతోనే ఆరోగ్యం..
నార్మల్ డెలివరీతో తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే, సర్కారు ఆస్పత్రుల్లో నార్మల్ డెలివరీలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. ప్రోత్సహిస్తున్నది. ఆస్పత్రికి వచ్చిన గర్భిణులకు అవగాహన కల్పించి, నార్మల్ డెలివరీల ఉపయోగాలను, కడుపు కోత డెలివరీలతో వచ్చే నష్టాలను వివరిస్తున్నది. గర్భం దాల్చినప్పటి నుంచి కాన్పు అయ్యేంత వరకు తొమ్మిది నెలలపాటు ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటే సుఖ ప్రసవాలు అవుతాయని వివరిస్తున్నది. కడుపు కోత కాన్పుతో మున్ముందు కలిగే నష్టాలను, సుఖ ప్రసవాలతో వచ్చే లాభాలను వైద్యులు, సిబ్బంది సవివరంగా చెబుతున్నారు. దీంతో అనేకమంది గర్భిణులు సుఖ ప్రసవాలకే మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది ప్రభుత్వ ఆసుపత్రుల్లో 9,834 డెలివరీలు జరిగాయి. ఇందులో 6,048 సాధారణ కాన్పులు. మిగిలిన 3786 ఆపరేషన్లు. ప్రైవేటు ఆస్పత్రుల లెక్కకు వస్తే.. ఇదే ఏడాదిలో 4813 ఆపరేషన్లు జరిగాయి. వీటిలో 1331 మాత్రమే సుఖ ప్రసవాలు. మిగిలిన 3482 మందికి కడుపు కోత (ఆపరేషన్లు) పెట్టారు.
కేసీఆర్ కానుక..
డెలివరీ అయి ఇంటికి వచ్చాక తల్లీబిడ్డలకు ఎన్నో ఖర్చులు ఉంటాయి. దీనిని కూడా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించుకుని ఇంటికెళ్లే బాలింతకు సీఎం పేరుతో ‘కేసీఆర్ కిట్'ను, రూ.13 వేల నగదును బహుమతిగా అందిస్తున్నది. బాలింతకు, బిడ్డకు మూడు నెలలకు సరిపడినన్ని వస్తువులు ఆ కిట్‌లో ఉంటున్నాయి. ఇతరత్రా ఖర్చులకు ఆ నగదు ఉపయోగపడుతున్నది. ఇలా.. బాలింతపై, ఆమె పుట్టింటిపై, మెట్టింటిపై ఖర్చుల భారం తగ్గుతున్నది..
రాష్ట్రంలోనే మొదటి స్థానంలో
సాధారణ ప్రసవాల్లో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి మొదటిస్థానంలో నిలిచింది. వ్యాయామాలు చేయించడం, ప్రత్యేక శిక్షణలు ఇవ్వడం ద్వారా ఆసుపత్రి వైద్యులు నార్మల్ డెలివరీల సంఖ్యను గణనీయంగా పెంచారు. సాధారణ కాన్పుల సంఖ్య ఇతర జిల్లాల్లో ప్రభుత్వ లక్ష్యానికి కంటే చాలా తక్కువగా ఉంది. ఖమ్మం జిల్లాలో టార్గెట్‌కు దగ్గరగా ఉంది. ఖమ్మం జిల్లాలో ప్రతి నెలా కనీసం 300 చొప్పున ఏడాదికి 3600 నార్మల్ డెలివరీలు ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నాయి.
నార్మల్ డెలివరీలపై అవగాహన కల్పిస్తున్నాం
సిజేరియన్స్ చేయడం వల్ల తల్లికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అందుకే ఎక్కువగా నార్మల్ డెలివరీలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఆస్పత్రికి వచ్చినప్పటి నుంచి నార్మల్ డెలివరీల ఉపయోగం గురించి వైద్యులు అవగాహన కల్పిస్తున్నారు. బలమైన ఆహారం తీసుకుంటూ, శరీరానికి కొంత శ్రమ కూడా కల్పిస్తే సుఖ ప్రసవం అయ్యేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నాం. మా ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే అత్యధికంగా సుఖ ప్రసవాలు అవుతున్నాయి.
-డాక్టర్ రమేశ్, జిల్లా ఆస్పత్రి సమన్వయకర్త