రెండు జిల్లాల్లో కరోనా కలకలం

భూపాలపల్లి ‌: మహబూబాబాద్‌, భూపాలపల్లి జిల్లాలో కరోనా కలకలం సృష్టించిం ది.  వలస కూలీలు, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారికి పాజిటివ్‌ వచ్చింది. తొర్రూరు మండలం కంఠాయపాలెంలో ఒక్కరికి, అమ్మాపురానికి చెందిన 5 నెలల బాలుడికి, మడిపల్లికి చెందిన ఇద్దరికి కరోనా సోకినట్లు పరీక్షల్లో తేలింది. వీరంతా మహారాష్ట్ర నుంచి స్వగ్రామాలకు వచ్చిన వారని ఆర్డీవో ఈశ్వరయ్య చెప్పారు.  లాక్‌డౌన్‌ లో ఇచ్చిన సడలింపులతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న 2600 మంది ఇటీవల జిల్లాకు వచ్చారు. మహారాష్ట్రలోని బోర్‌వెల్లి నుంచి 12 మంది కలిసి బస్సులో ఈ నెల 16న తొర్రూరు, కంఠాయపాలెం, అమ్మాపురం, మడిపల్లికి చేరుకున్నారు. కంఠాయపాలేనికి చెందిన ఒకరు అనారోగ్యంగా ఉండడంతో మానుకోట దవాఖానకు 17న తరలిస్తుండగా మృతి చెందాడు. అధికారులు మృతుడి భార్యను జిల్లా కేంద్రంలోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్‌ వ చ్చింది. ఆమె కుటుంబ సభ్యులు, బస్సులో కలిసి ప్రయాణించిన వారు వీరి ప్రైమరీ కాంటాక్టులకు సంబంధించి 27 మందిని మహబూబాబాద్‌  ఐసోలేషన్‌ వార్డులో ఉంచి శాంపిల్స్‌ సేకరించి పరీక్షలకు పంపించారు. కంఠాయపాలెంలో కరోనా వచ్చిన వ్యక్తి అల్లుడికి, అ మ్మాపురానికి చెందిన 5 నెలల బాలుడికి, మడిపల్లికి చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. శుక్రవారం ముగ్గురు వలస కూలీలు, ఒక వైద్య సిబ్బందితో పాటు మరో 20 మంది నమునాలు పరీక్షకు పంపగా ఫలితాలు రావాల్సి ఉన్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ శ్రీరాం తెలిపారు. కంఠాయపాలెం, మడిపల్లి, అమ్మాపురం గ్రామాల్లో వైద్య బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నా యి. ఆర్డీవో ఈశ్వరయ్య, డీఎస్పీ వెంకటరమణ, సీఐ చేరాలు, తహసీల్దార్‌ రమేశ్‌బాబు, ఎంపీడీవో గుండెబాబు తదితరులు ఆయా గ్రామాల్లో పర్యటించి, ప్రజలకు సూచనలిచ్చారు.


భూపాలపల్లిలో వృద్ధుడికి కరోనా


జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. చిట్యాల మండలం నవాబుపేటకు చెందిన వృద్ధ దంపతుల్లో ఒకరికి పాజిటివ్‌ వచ్చిందని డీఎంహెచ్‌వో గోపాల్‌రావు తెలిపారు. ముంబా యిలో ఉన్న తమ కుమారుడి వద్దకు 50 రోజుల క్రితం వెళ్లారని, అక్కడి నుంచి ఈనెల 14న స్వగ్రామానికి చేరుకున్నారని తెలిపారు. వృద్ధులను అధికారులు హోంక్వారంటైన్‌లో ఉంచి గురువారం రాత్రి పరీక్షలు నిర్వహించగా భర్తకు పాజిటివ్‌, అతడి భార్యకు నెగిటివ్‌ వచ్చిందని తెలిపారు. కాగా, భార్యకు మళ్లీ పరీక్షలు నిర్వహించి, ఆమెకు పాజిటివ్‌ వస్తే ఇద్దరినీ గాంధీ దవాఖానకు తరలిస్తామని డీఎంహెచ్‌వో తెలిపారు.