హైదరాబాద్ : అత్యవసర పరిస్థితుల్లో ఫస్ట్ ఎయిడ్ చికిత్సనందిస్తూ రోగులకు అండగా నిలవాల్సిన ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులు నిబంధనలను తుం గలో తొక్కుతున్నారు. వైద్యమోమహాప్రభో అంటూ ఆశ్రయించే రోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అందినకాడికి దండుకుంటున్నారు. కరోనా లాంటి మహమ్మారి విజృంభిస్తున్న పరిస్థితుల్లోనూ ఆర్‌ఎంపీ వైద్యులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈకోవకు చెందిన ఓ సంఘటన శేరిలింగంపల్లి పాపిరెడ్డికాలనీలో తాజాగా వెలుగులోకొచ్చింది. ముం బై నుంచి 60ఏండ్ల వృద్ధుడు పాపిరెడ్డికాలనీలో నివసించే కొడుకుల వద్దకు 10 రోజుల కిందట వచ్చాడు. అయితే వారంరోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతూ స్థానికంగా ఉండే ఆర్‌ఎంపీ వైద్యుడిని సంప్రదించాడు. ఆ వైద్యు డు పరీక్షించి నాలుగైదు రోజులు దవాఖానకు తిప్పించుకుంటున్నాడు. ఇదే సమయంలో ఆశవర్కర్లు ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ముంబై నుంచి వచ్చిన వృద్ధుడి వివరాలను సేకరించి అతడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అతడికి కరోనా లక్షణాలు ఉండడంతో కొవిడ్ బృందానికి సమాచారం అందించి ప్రభుత్వాసుపత్రికి 3 రోజుల క్రితం తరలించారు. పరీక్షల అనంతరం మంగళవారం రాత్రి వృద్ధుడికి పాజిటివ్‌గా నిర్ధారణకావడంతో అసలు విషయం బయటపడింది. దీంతో వృద్ధుడికి వైద్యసేవలు అందించిన ఆర్‌ఎంపీ డాక్టర్‌ను క్లోజ్డ్ కాంటాక్ట్‌గా గుర్తించారు. అయితే ఆ ఆర్‌ఎంపీ పరారీలో ఉండడంతో అతడి కోసం కొవిడ్ బృందం గాలిస్తున్నది.