నిర్మ‌ల్ జిల్లాలో వలస కూలీలకు కరోనా

నిర్మల్ : గ్రీన్ జోన్ గా ప్ర‌క‌టించిన నిర్మ‌ల్ జిల్లాలో తాజాగా ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ ఇద్దరు వ్య‌క్తులు మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కూలీలే కావడం గమనార్హం. ముంబై కార్మికవాడల్లో పని చేస్తూ లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయి స్వస్థలాలకు వచ్చిన ఐదుగురిలో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. వారిలో నిర్మల్‌ పట్టణానికి చెందిన ఒకరు, ఖానాపూర్‌ మండలం గోడలపంపునకు చెందిన మరొకరికి కరోనా పాజిటివ్‌గా తేలిన‌ట్టు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. వీరిద్దరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించామ‌ని కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ తెలిపారు. వీరిద్దరి కుటుంబ సభ్యులతో పాటు వీరితో ముంబైౖ నుంచి వచ్చిన మరో ముగ్గురిని క్వారంటైన్‌లో ఉంచినట్లు చెప్పారు.