హుజూరాబాద్, (ఆరోగ్యజ్యోతి): రాష్ర్టంలో కరోనా అసలు కథ ఇప్పుడే మొదలైందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనాను లైట్ తీసుకోవద్దని జూన్, జులై నెలల్లో మరిన్ని ఎక్కువ కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని మధువని గార్డెన్స్‌లో ‘సమగ్ర వ్యవసాయం–సుస్థిర వ్యవసాయం’ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఇందులో ఈటల మాట్లాడుతూ ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తున్నందున పల్లెలు, పట్టణాలు క్షేమంగా ఉండే పరిస్థితి లేదని అన్నారు. మొదటి రెండు నెలలు లాక్డౌన్ విషయంలో సీరియస్ గా వ్యవహరించామని, అందుకే ఎక్కువ కేసులు నమోదు కాలేదన్నారు. కరోనా అదుపులోకి వచ్చి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేస్తే.. వచ్చే నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హుజూరాబాద్ నియోజకవర్గానికి తీసుకువస్తానని చెప్పారు.