నేటి నుంచి దోమలపై దండయాత్ర!

జూన్‌ 1 నుంచి 8 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు
సిద్ధమవుతున్న సర్పంచులు, యంత్రాంగం
రాష్ట వ్యాప్తంగా అమలు 


కరోనాను కట్టడి చేయడమే కాకుండా.. వానాకాలంలో దండెత్తే దోమలను నివారించేందుకు యంత్రాంగం సిద్ధం అవుతోంది. వీటన్నింటికీ శుభ్రత చర్యలే ప్రధానంగా భావించి జూన్‌ 1 నుంచి 8వ తేదీ వరకు పల్లెల్లో ‘ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం’ . పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య పనులు నిత్యం నిర్వహిస్తున్నారు. గతేడాది డెంగీ, మలేరియా జ్వరాలు పెరిగిన నేపథ్యంలో ఈఏడాది కరోనాకు విషజ్వరాలు తోడు కాకుండా ఉండేందుకు ముందస్తుగా దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామస్థుల సహకారంతో ప్రణాళిక సిద్ధం చేసి శుభ్రత చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. మొదటి రోజు గ్రామంలో పాదయాత్ర చేసి సమస్యలను గుర్తించనున్నారు.


శుద్ధినీటి సరఫరా..
. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వామ్యం కానున్నారు. వ్యాధులు ప్రబలేందుకు ప్రధానంగా కారణమైన అపరిశుభ్ర నీటి సరఫరా, మురుగు నిల్వలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. నెలకు కనీసం మూడు సార్లు నీటి ట్యాంకులు శుభ్రం చేసి శుద్ధినీటిని సరఫరా చేయడం, మురుగు గుంతలు లేకుండా శుభ్రం చేయనున్నారు. ప్రతిరోజు జరిగే పనులపై మండల అభివృద్ధి అధికారి, పంచాయతీ అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. కార్యక్రమ విషయంలో సర్పంచులు, కార్యదర్శులెవరైనా నిర్లక్ష్యం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఆదేశాల్లో పేర్కొన్నారు. పనులు పక్కాగా నిర్వహిస్తామని జిల్లా, మండల పంచాయతీరాజ్‌శాఖ అధికారులు పేర్కొంటున్నారు.


చేపట్టే పనులు ఇవే..
వీధుల్లో ఎప్పటికప్పుడు కాల్వలు శుభ్రం చేసి చెత్తను తొలగించడం, మురుగునీటిలో దోమలు వృద్ధి కాకుండా చూడడం.
నెలకు మూడుసార్లు నీటి ట్యాంకులను శుభ్రం చేయడం, శుద్ధమైన నీటి సరఫరా చేయడం, లీకేజీలున్న పైపులను వెంటనే బాగు చేయించడం.
ఇళ్ల పరిసరాల్లో పిచ్చిమొక్కల తొలగింపు, తదుపరి అపరిశుభ్రంగా మారకుండా చూసుకోవడం.
వార్డుల్లో తరుచూ దోమల నివారణ మందు పిచికారీ చేయడం.
పాఠశాలలు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, జన సంచార ప్రాంతాల్లో నిత్యం పారిశుద్ధ్య పనులు చేపట్టడం.
ఇళ్లలోని చెత్త ఎక్కడపడితే అక్కడ పడేయకుండా తడి, పొడిగా చేసి డంపింగ్‌ యార్డుకు తరలించేలా చర్యలు.
రోడ్డుపై ఎవరైనా చెత్త వేస్తే రూ.500 జరిమానా విధించడం, పునరావృతం కాకుండా చైతన్యం కల్పించడం, గ్రామం శుభ్రంగా ఉంటేనే వ్యాధులు దరి చేరవని ప్రజలకు అవగాహన కల్పించడం.