- భవిష్యత్తులో ఊపిరితిత్తులపై ప్రభావం: రమేష్‌రెడ్డి
- లాక్‌డౌన్ సడలింపులతో వైరస్ వ్యాప్తికి ఎక్కువ అవకాశం
- ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగానే వైద్య పరీక్షలు
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజా ఆరోగ్యశాఖ సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు , వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ రమేష్‌రెడ్డి అన్నారు.లాక్‌డౌన్ సడలింపులతో జనం రోజు వారీ కార్యకలాపాల్లో విరివిగా పాల్గొంటుండటంతో వైరస్ వ్యాప్తికి ఎక్కువ అయ్యే అవకాశం ఉందని వారు తెలిపినారు. వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని వారు పేర్కొన్నారు . శనివారం నాడు కోఠి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ పక్కాగా అమలైందని, అందువల్లే కరోనా అదుపులో ఉందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కేసులు, మరణాల సంఖ్య తక్కువగా ఉందన్నారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగానే వైద్య పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు.పరీక్షలు, కేసుల నమోదు అంశాలు దాచినా దాగేవి కావన్నారు. అవసరం ఉన్న వారికే నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంటూ ఇప్పటివరకు రాష్ట్రంలో 30వేలకుపైగా పరీక్షలు చేశామని, 2వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. లాక్‌డౌన్ తర్వాత ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ కట్టడికి మూడు సూత్రాలు పాటించాలని జి.శ్రీనివాసరావు సూచించారు. బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతికదూరాన్ని పాటించాలని, వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇవి పాటిస్తే కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకున్నట్టేనన్నారు.రాష్ట్రంలో కేసుల నమోదు తీరును పరిశీలిచినట్లయితే . జనసమూహాలు ఎక్కువగా ఉన్న చోటే కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయన్నారు. శుభకార్యాలు వంటి కార్యక్రమాల వల్లే ఒకే కుటుంబానికి చెందిన పలువురు వైరస్ బారిన పడ్డారన్నారు. కరోనా కట్టడిలో తెలంగాణ గెలిచిందని, ప్రజలంతా మరింత జాగ్రత్తగా ఉంటే కరోనాపై విజయం సాధిస్తామన్నారు.
అనంతరం వైద్య విద్య సంచాలకుడు రమేష్‌రెడ్డి మాట్లాడుతూ రోజు రోజుకు వైరస్ ప్రభావం ఊపిరి తిత్తులపై ఉంటుందని, కొన్నేళ్ల తర్వాత అది బయటపడొచ్చన్నారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తికి చికి త్స చేసే క్రమంలో వెంటిలేటర్ అవసరం చాలా తక్కువన్నారు. 5శాతం మందికి మాత్రమే ఇది వాడాల్సిన అవసరం వచ్చిందన్నారు. లాక్‌డౌన్ సడలింపులతో కేసుల తీవ్రత పెరుగుతుందని ముందే ఊహించామని, ఇందులో భాగంగా వసతులు, సౌకర్యాలు కల్పించి ఎక్కువమందికి చికిత్స అందేలా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో 170 వెంటిలేటర్లు ఏర్పాటు చేశామని, కింగ్‌కోఠి ఆస్పత్రి, టిమ్స్ తదితర ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో చికిత్స చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. కరోనా వైరస్‌కు చికిత్స తీసుకున్న 7రోజుల తర్వాత బాధితుడి నుంచి మరొకరికి వైరస్ సోకదని, తొమ్మిదో రోజు అతడిలో వైరస్ కణాలు నశిస్తాయన్నారు.ముక్యంగా ప్రజలు బౌతిక దురాన్ని పాటించాలని సూచించారు.