న్యూఢిల్లీ : ఉచితంగా భూములు పొందిన ప్రైవేట్ ఆస్పత్రులను కరోనా బాధితులకు ఉచితంగా చికిత్సనందిచేందుకు ప్రభుత్వం ఎందుకు అనుమతించరని సుప్రీంకోర్టు బుధవారం ప్రశ్నించింది. వారంరోజుల్లోగా ఈ అంశంపై నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ.. కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఉచితంగా లేదంటే సాధారణ ఫీజుతో వారికి చికిత్సనందించవచ్చని సూచించింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలసకార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, దయనీయ పరిస్థితులను పరిష్కరించడంలో కేంద్రం విఫలమవడాన్ని సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కాలినడకన వెళుతున్న వలసకార్మికులు ఇప్పటికీ జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్లు, రాష్ట్రాల సరిహద్దుల్లో నిలిచిపోవడం చూస్తున్నామని జడ్జి పేర్కొన్నారు. వారికి ఉచితంగా రవాణా, ఆహారం, ఆశ్రయం ఎందుకు కల్పించలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాలినడకన తమ సొంత గ్రామాలకు వెళుతున్న వలసకార్మికులు ప్రమాదవశాత్తు, ఇతర పరిస్థితుల్లో ప్రమాదాల, మృత్యువు బారిన పడుతున్న ఘటనలను వార్తా పత్రికలు, మీడియా ద్వారా తెలుసుకున్నట్లు కోర్టు పేర్కొంది.