హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి: చాపకింద నీరులా వ్యాపిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టేందుకు ఇప్పటికే ఎన్నో దేశాలు వ్యాక్సిన్ ని కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పరిశోధకులు కూడా కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయడానికి వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. కరోనాని పూర్తి స్ధాయిలో మట్టు పెట్టడానికి కరోనా నిర్మూలన చికిత్సలో భాగంగా వ్యాక్సిన్ కనుగొనేందుకు నడుం బిగించారు. ఇందులో భాగంగానే యాంటీ బాడీ వ్యవస్ధలతో కూడిన ఇమ్యునో థెరపీని అభివృధ్దిచేసే యోచనలో ఉన్నట్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ అప్పారావు తెలిపారు.ప్రస్తుతం అక్కడక్కడా ఉపయోగిస్తున్న ప్లాస్మా థెరపి అనేది కొంతమందికి మాత్రమే పనిచేస్తుందని తెలిపారు. అది కూడా కేవలం ఒకే రక్త గ్రూప్ ఉన్నవారికే అని స్పష్టం చేసారు. కానీ గుర్రాల నుంచి సేకరించిన యాంటీ బాడీస్ సమర్ధవంతంగా పని చేయటంతో పాటు రోగులపై దుష్ప్రభావాలు చూపవని ఆయన అన్నారు. అందుకే గుర్రం నుంచి ఎక్కువ మొత్తంలో రక్తం తీసుకొని అందులో ఉన్న యాంటీ బాడీస్‌తో వ్యాక్సిన్ తయారీ జరుగుతుందని తెలిపారు. అయితే ఈ వ్యాక్సిన్ సిద్ధం కావడానికి ఆరు నెలలు సమయం పడుతుందని వీసీ అప్పారావు పేర్కొన్నారు.