పంటల ప్రణాళిక ఖరారు

ఖమ్మం : ఏటా మార్కెట్‌పై అంచనా లేకుండా రైతులు తమ ఇష్టానుసారం సాగు చేపట్టడం, తద్వారా అన్నదాతలు ఆశించిన మేర ఆదాయం రాకపోవడం వంటివి జరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వమే పంటలను కొనుగోలు చేస్తున్నది. ప్రైవేట్‌ వ్యాపారుల్లో సైతం పోటీ తత్వం తీసుకరావడం., డిమాండ్‌ ఉన్న పంటలనే రైతులు పండించేలా చర్యలు తీసుకోవడం వంటి సరికొత్త ఆలోచనలతో సీఎం కేసీఆర్‌ ముందుకుసాగుతున్నారు. అందుకు అనుగుణంగా గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయశాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాలో వానకాలం సీజన్‌లో పంటల సాగు విస్తీర్ణం ఖరారైంది. నిరుటి మాదిరిగానే అదే విస్తీర్ణంలో ఈ ఏడాది కూడా సాగు జరుగనుంది. జిల్లా వ్యాప్తంగా ఆయా పంటలను 5,18,672 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయాలని ప్రభుత్వం జిల్లా వ్యవసాయశాఖకు లక్ష్యం నిర్దేశించింది. అందుకు అనుగుణంగానే సీఎం కేసీఆర్‌  గురువారం హైదరాబాద్‌లో నియంత్రిత పంటల సాగు విధానంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యవసాయశాఖకు పంటల ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. పంటల సాగులో స్పల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. మొత్తం సాగు విస్తీర్ణం అదే స్థాయిలో ఉంది. కానీ పత్తి సాగు స్పల్పంగా తగ్గనుంది. వరి సాగు స్పల్పంగా పెరుగనుంది. మక్కల సాగు వానకాలం సీజన్లో పూర్తిగా తొలగిపోయింది. మక్కలకు బదులు కంది, ఇతర అపరాల సాగు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యాన పంటలు, ఆయిల్‌పామ్‌ సాగుపై కార్యాచరణ రూపొందింది. అన్ని పంటలకూ అనువైన భూములు, సాగునీరు జిల్లాలో పుష్కలంగా ఉన్నాయి. పత్తి, వరి, కంది పంటలు ఈ సీజన్‌లో సాగు చేసే విధంగా ప్రభు త్వం ఆదేశాలు జారీ చేసింది. పెసర, మినుము, చెరకు తదితర పంటల సాగుకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళిక ఖరారు చేసే అవకాశం ఉంది. ఆయకట్టు ప్రాంతంలో ప్రధాన పంటగా వరి సాగు జరిగితే, ఇతర మైదాన ప్రాంతాల్లో పత్తి, కంది పంటలు సాగు కానున్నాయి. రైతుల ఆర్థిక ఇబ్బందులు, భౌగోళిక పరిస్థితులు, దిగుబడులు వంటివి అంచనా వేసి నియంత్రిత సాగు విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ సూచనలకు అనుగుణంగా సాగు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు.


వానకాలం ప్రధాన పంటగా పత్తి, వరి 


నిరుడు వానకాలం సీజన్‌లో 2.55 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైంది. ఈ ఏడాది కొంతమేర తగ్గి 2.43 లక్షల ఎకరాలకు పరిమితమైంది. మరో ప్రధాన పంట అయిన వరి కూడా గతంలో 2.28 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ సంవత్సరం 2.30 లక్షల ఎకరాల్లో సాగు కానుంది. కంది, పెసర పంటల సాగు గతంలో నామమాత్రంగానే ఉండేది. అయితే ఈ ఏడాది కంది 10 వేల ఎకరాల్లో, పెసర 22 వేల ఎకరాల్లో సాగయ్యేలా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వాణిజ్య, వ్యవసాయ, అపరాల పంటల సాగు సమపాళ్లలో జరిగే విధంగా ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ రూపొందించింది. ఇప్పటి వరకూ సాగిన మూస పద్ధతిని ప్రభుత్వం తొలగించింది. ఈ సీజన్‌లో మొక్కజొన్నను పూర్తిగా పక్కనబెట్టింది.


అనువైన భూములు.. సరిపడా సాగునీరు


అన్ని పంటలకు అనువైన నేలలు, నైపుణ్యం కలిగిన రైతులు ఖమ్మం జిల్లా సొంతం. సాగునీరు సరిపడా ఉండడం రైతులకు అదనపు ప్రయోజనం. జిల్లాలో 16 మండలాలు ఆయకట్టు పరిధిలో ఉన్నాయి. ప్రధాన నీటి వనరులైన పాలేరు, వైరా, లంకాసాగర్‌ ప్రాజెక్టుల కింద గడిచిన రెండేళ్లుగా 100 శాతం సాగు జరుగుతున్నది. మైదాన ప్రాంతం భూములకు భక్తరామదాసు ప్రాజెక్టు వరంలా మారింది.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో..


కొత్తగూడెం: నియంత్రిత సాగు విధానం ద్వారా పంటలు సాగు చేస్తే రైతులు అధిక దిగుబడి సాధించవచ్చనే ప్రభుత్వ నిర్ణయాన్ని రైతులు స్వాగతిస్తున్నారు. వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయగా వాటిని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందరూ ఒకే రకం పంటలు వేస్తే లాభం ఉండదని, రైతులు ఏటా నష్టపోతున్నారని తెలంగాణ ప్రభుత్వం యోచించింది. ఈసారి సాగులో మార్పులు చేస్తూ రైతులకు సలహాలు, సూచనలిస్తున్నది. ఏ సీజన్‌లో ఎలాంటి పంటలు వేస్తే లాభాలు వస్తాయనే విషయాలను వివరిస్తున్నది. తాజాగా జిల్లాలో అమలు చేసే సాగు ప్రణాళికను వెల్లడించింది. భద్రాద్రి కలెక్టర్‌ ఎంవీ రెడ్డి నేతృత్వంలో జిల్లా వ్యవసాయాశాఖధికారి, రైతుబంధు సమితి సభ్యులు రైతులను నియంత్రిత సాగు వైపు నడిపించేందుకు సిద్ధమవుతున్నారు.


నియంత్రిత పంటలే సాగు అంటున్న ప్రభుత్వం


నియంత్రిత పంటల సాగుతో రైతులకు ఎలాంటి నష్టాలు రావని అధికారులు సూచిస్తున్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావాలని ఉద్దేశంతో ప్రభుత్వం రైతుల కోసం నియంత్రిత పంటల సాగు ప్రణాళికను తయారు చేసింది. జిల్లాలోని వ్యవసాయ భూములకు అనుగుణంగా ఎలాంటి పంటలు వేయాలి, లాభసాటి పంటలు వేస్తేనే రైతులకు లాభం కలుగుతుందనే విషయాలపై అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. వరి సాగులో సన్నాలు మాత్రమే పండించాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది.


కందులు, పత్తి సాగు చేస్తే లాభాలు


వానకాలం పంటలో మక్కలు వేస్తే పూర్తిగా నష్టం వస్తుందని, అందువల్ల మక్కలకు బదులుగా కందులు సాగు చేయాలి. గతేడాది 1,479 ఎకరాల్లో కంది సాగు చేయగా ఈ ఏడాది 13,700 ఎకరాల్లో పంట వేయాలని అధికారులు సూచిస్తున్నారు. గతేడాది 1,53,298 ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఈ ఏడాది 1,83,416 ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం పంటల ప్రణాళికను వ్యవసాయ అధికారులు సిద్ధం చేశారు.