జలుబు, జ్వరం రోగులకు ప్రత్యేక ఓపీ

హైదరాబాద్‌: కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ గడువు త్వరలో ముగియనుండటంతో.. ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రధానంగా ఐదు అంశాలపై ఎక్కవగా ఫోకస్‌ చేస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం  మార్గదర్శకాలను విడుదల చేసింది. అన్ని వైద్య సంస్థలు సాధారణ సేవలందిస్తూ.. కరోనా చికిత్సకూ సన్నద్ధంగా ఉండాలని, జ్వరం, ఫ్లూ, శ్వాసకోశ సంబంధిత జబ్బుల నిఘాను మరింత పెంచాలని, వలస కార్మికులపై మరింత దృష్టి పెట్టాలని, పట్టణ ప్రాంతాలపై ఎక్కువగా ఫోకస్‌ చేయాలని, వృద్ధులు, చిన్నపిల్లలను కాపాడుకోవాలని ఆదేశించింది.లాక్‌డౌన్‌ తర్వాత సన్నద్ధతను వివరిస్తూ.. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా దవాఖానాలను సిద్ధం చేయాలని సూచించింది. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో వచ్చేవారి కోసం ప్రత్యేక ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని, ప్రత్యేక వెయిటింగ్‌ రూమ్‌తోపాటు భౌతిక దూరం ఉండేలా చూడాలని, అన్ని పీహెచ్‌సీల్లో మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు, మందులు అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొంది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌కు సంబంధించిన ఫింగర్‌ టిప్‌ పల్స్‌ ఆక్సోమీటర్‌ లభ్యతను పర్యవేక్షించుకోవాలని తెలిపింది. రోగికి మాస్కు ఉంటేనే ఆస్పత్రి లోపలికి అనుమతించాలని, ఒక్కో పేషెంట్‌ను పరిశీలించిన ప్రతిసారీ స్టెతస్కోప్‌, థర్మామీటర్‌, బీపీ మిషన్‌ను డిస్‌ ఇన్‌ఫెక్ట్‌ రేస్పతో శుభ్రం చేయాలని ఆదేశించింది. డాక్టర్లు, సిబ్బంది అంతా మాస్క్‌, గ్లవ్స్‌ ధరించాలని, ఆస్పత్రిలో ప్రతి భాగాన్ని, రోజూ రెండుసార్లు సోడియం హైపోక్లోరైట్‌ సొల్యూషన్‌తో శుభ్రం చేయాలని తెలిపింది. అంబులెన్స్‌లు కరోనా అనుమానితుల్ని తీసుకొచ్చిన ప్రతిసారీ డిస్‌ ఇన్‌ఫెక్ట్‌ చేయాలని పేర్కొంది.పట్టణ ప్రాంతాల్లో సర్వైలెన్స్‌పై ఎక్కువ ఫోకస్‌ చేయాలని, మునిసిపల్‌, పోలీస్‌, హెల్త్‌ సిబ్బంది కలిసి పనిచేయాలని వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. ఐఎల్‌ఐ, సారి కేసుల్లో పెరుగుదల ఉంటే డీఎంహెచ్‌వోకు, కలెక్టర్‌కు తెలపాలని ఆదేశించింది. ఇక ప్రతి ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్త తమ పరిధిలో జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారిని గుర్తించి, పీహెచ్‌సీకి పంపాలని, వలస కార్మికులు హోం క్వారంటైన్‌లో సరిగా ఉంటున్నారో, లేదో పర్యవేక్షించాలని, వారిలో కరోనా లక్షణాలు మొదలైతే అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు శ్వాస సంబంధిత జబ్బులతో వచ్చే రోగుల వివరాలను ఈ-బర్త్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని, వారందరికీ విధిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించాలని ఆదేశించింది. డయాబెటిస్‌, హైపర్‌ టెన్షన్‌, టీబీ పేషెంట్లు, వృద్ధులు కరోనా వైరస్‌ బారిన పడకుండా చూసుకోవాలని, వారిలో ప్రతి ఒక్కరికీ రెండు క్లాత్‌ మాస్కులను ఉచితంగా అందించాలని, ఇంటి వద్దకే వెళ్లి బీపీ, షుగర్‌ టెస్ట్‌ చేయాలని పేర్కొంది. నెలకు సరిపడా మందులు అడ్వాన్స్‌గా ఇవ్వాలని పేర్కొంది.