కరీమాబాద్,(ఆరోగ్యజ్యోతి) : రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వరంగల్ రైల్వేస్టేషన్‌లో దింపేశారు. స్టేషన్ మేనేజర్ శ్రీనివాస్ కథనం ప్రకారం.. చైన్నై నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ శనివారం మధ్యాహ్నం 3.45 గంటలకు వరంగల్ స్టేషన్‌కు చేరుకుంది. కోచ్–8లో చెన్నై నుంచి వరంగల్ వరకు రావాల్సిన యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి (40) ఉన్నాడు. ఆయన చెన్నైలో రైలు ఎక్కే సమయంలో పరీక్షలు నిర్వహించారు. అయితే రైలు బయలుదేరాక అతనికి పాజిటివ్ ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. అప్పటికే రైలు విజయవాడ చేరుకుందని తెలియడంతో వారు వరంగల్ స్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. రైలు ఇక్కడికి చేరుకోగానే సదరు వ్యక్తికి పీపీఈ కిట్ వేయించి అంబులెన్స్‌లో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇక ఇదే బోగీలో మొత్తం 41 మంది ఉండగా ఏడుగురు వరంగల్ స్టేషన్‌లో దిగారు. వీరందరికీ వైద్య పరీక్షలు చేయించడంతో పాటు బోగీని శానిటైజేషన్ చేశాక 5.20 గంటలకు రైలును పంపించారు.