డిమాండ్ ‌ఉన్న పంటతోనే ఆదాయం

హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతుబంధు సమితులు రైతాంగం గొంతుకను వినిపించాలని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సమగ్ర వ్యవసాయవిధానం అమలులో కీలకంగా పనిచేయాలని సూచించారు. గురువారం రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లాల రైతుబంధు సమితి అధ్యక్షుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. నియంత్రిత పంటల సాగు విషయంలో ప్రభుత్వ ఉద్దేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. డిమాండ్‌ ఉన్న పంటలు సాగుచేస్తేనే ఆదాయం వస్తుందని రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. రైతులు ప్రభుత్వం నిర్ణయించిన పంటలనే సాగుచేసేలా రైతుబంధు సమితులు కిందిస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. కల్తీవిత్తనాలు దొరికితే పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్‌రెడ్డి, వివిధ జిల్లాల రైతుబంధు సమితి అధ్యక్షులు పాల్గొన్నారు.